విష్ణు.. నువ్వు ఫ్రీగా పనిచేసుకో.. నా 11 మంది రాజీనామా చేస్తున్నారు: ప్రకాశ్‌రాజ్ సంచలన నిర్ణయం

By Siva KodatiFirst Published Oct 12, 2021, 5:32 PM IST
Highlights

తమ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ప్రకాశ్ రాజ్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో తన ప్యానెల్ నుంచి 11 మంది గెలిచారని ప్రకాశ్ రాజ్ చెప్పారు. 

తమ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ప్రకాశ్ రాజ్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో తన ప్యానెల్ నుంచి 11 మంది గెలిచారని ప్రకాశ్ రాజ్ చెప్పారు. అయితే గడిచిన రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలపై కలిసి కూర్చొని చర్చించామని ఆయన తెలిపారు. మా మంచి కోసం పోటీలో నిలిచామని.. తొలి నుంచి కూడా ఒకే ప్యానెల్ వుండాలని తాము ప్రచారం చేశామని , కానీ క్రాస్ ఓటింగ్  జరిగిందని ప్రకాశ్ రాజ్ చెప్పారు. సగం మంది తన ప్యానెల్ నుంచి సగం మంది విష్ణు ప్యానెల్ నుంచి ఎన్నికయ్యారని ఆయన తెలిపారు. గెలిచిన, ఓడిపోయిన సభ్యులతో తాను ఎన్నికలు జరిగిన విధానం గురించి చర్చించానని చాలా రౌడీయిజం, మాటల పోరు, పోస్టల్ బ్యాలెట్స్‌లో అన్యాయం జరిగిందని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు.

అయినా ఎన్నికలు అపకూడదని ముందుకే వెళ్లామన్నారు. వేరే వూళ్ల నుంచి మనుషులను తెచ్చారని , డీఆర్‌సీ చీఫ్‌గా వున్న మోహన్ బాబు కౌంటింగ్‌కు వచ్చారని, కానీ క్రమశిక్షణ లేకుండా బెనర్జీపై చేయి చేసుకున్నారని, అసభ్యకరంగా మాట్లాడారని, నరేశ్ ప్రవర్తన బాలేదని ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. ఈసీ రిజల్ట్స్ పక్కనబెట్టారని.. తర్వాతి రోజు పోస్టల్ బ్యాలెట్లు కలపడం మరికొన్ని చర్యలతో లెక్కలు మారాయని ఆయన ఆరోపించారు. తన ప్యానెల్‌లో ఎనిమిది మందే గెలిచారని.. మిగిలిని మావి అన్నారని చెప్పారు. ఆదివారం గెలిచినవారు.. సోమవారం ఎలా ఓడిపోయారని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.

అందరినీ కలుపుకుని వెళ్తామన్న విష్ణు.. జనరల్ సెక్రటరీ, ట్రెజరీ మనవాడేనని.. ఎవడు అడ్డొచ్చినా మాదే మెజార్టీ అన్న ఆయన మాటలకు చాలా బాధేసిందని ప్రకాశ్ రాజ్ ఆవేదన  వ్యక్తం చేశారు. ఇలా మీరూ.. మేమూ అని అంటే కలిసి పనిచేయగలమా అని ఆయన ప్రశ్నించారు. ఇలా సగం సగం ప్యానెల్ వస్తే ఏం జరిగిందో గడిచిన రెండేళ్ల నుంచి చూస్తూనే వున్నామని, ఏ పని జరగలేదని ప్రకాశ్ రాజ్ చెప్పారు. మా అసోసియేషన్ మసకబారింది అనే వరకు పరిస్ధితి వచ్చేసిందని.. తనకు కావాల్సింది అది కాదన్నారు. ఇలా వుంటే తాము పనిచేయగలమా అని తన ప్యానెల్ సభ్యులు తనను అడిగారని ప్రకాశ్ రాజ్ చెప్పారు. మా సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయా అన్న భయం వేసిందన్నారు.  

ALso Read:మోహన్‌బాబు అమ్మనా బూతులు తిట్టారు.. మంచు లక్ష్మీ, విష్ణులను ఎత్తుకుని తిరిగా.. బోరున విలపించిన బెనర్జీ

విష్ణు బాగా పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన హామీలకు అడ్డు రాకూడదని, ఒకవేళ ఎలాంటి పని జరగకపోతే తమపై నిందలు వేయకుండా తాము కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. చాలా ఆలోచించిన తర్వాత సినిమా బిడ్డలు ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ విష్ణు, జాయింట్ సెక్రటరీ ఉత్తేజ్‌తో  సహా రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. మీరు మీకు కావాల్సిన వాళ్లని పెట్టుకుని ఫ్రీగా పనిచేయాలని సూచించారు. ఓటేసిన మా సభ్యులకు న్యాయం జరగాలని.. వారికి ఎలాంటి సంక్షేమం కలుగుతుందో చూస్తూ వుంటామని ప్రకాశ్ రాజ్ చెప్పారు. రేపు ఒకవేళ మీరు పనిచేయకపోతే వారి తరపున ప్రశ్నిస్తామని.. అలాగని పనులకు అడ్డురామని ఆయన తెలిపారు. వుండి పనిచేయడం కన్నా గొప్ప పని.. పని చేయించడమే అన్నారు. తన రాజీనామాను ఆమోదించనని విష్ణు చెప్పారని.. కానీ మా నిబంధనల్లో తెలుగువాడు కానీ వాడు పోటీ చేసేందుకు వీలు లేదు అని మీరు మార్చకపోతే తన రాజీనామాను వాపస్ తీసుకుంటానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. 

click me!