`మా` ఎన్నికల నోటిఫికేషన్‌.. ఒక వ్యక్తి ఒకే పోస్ట్

By Aithagoni RajuFirst Published Sep 17, 2021, 3:54 PM IST
Highlights

`మా` ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేసింది. వచ్చే నెల అక్టోబర్‌ 10న ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు గత మీటింగ్‌లో వెల్లడించారు. తాజాగా ఆ ఎన్నికల సరళి, నియమ నిబంధనలు వెల్లడించారు. `మా` 2021-23 ఎన్నికల నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది.

గత కొన్ని రోజులుగా హాట్‌ టాపిక్‌గా మారింది `మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌). పోటీచేయబోతున్న వారు నిత్యం ఆరోపణలు ప్రత్యారోపణలతో ఎన్నికలకు ముందే రసవత్తరంగా మారింది. `మా` ఎన్నికలు స్టేట్‌ ఎన్నికలను తలపిస్తున్న నేపథ్యంలో మొత్తంగా `మా` ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేసింది. వచ్చే నెల అక్టోబర్‌ 10న ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు గత మీటింగ్‌లో వెల్లడించారు. తాజాగా ఆ ఎన్నికల సరళి, నియమ నిబంధనలు వెల్లడించారు. 

`మా` 2021-23 ఎన్నికల నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది. అక్టోబర్‌ 10న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకూ జూబ్లీ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్‌ జరగనున్నట్లు ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఎనిమిది మంది ఆఫీస్‌ బేరర్స్‌, 18మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌తో కూడిన ఈ ఎన్నికలకు ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, నామినేషన్‌ ఉపసంహరణకు వచ్చే నెల 1,2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఉంటుందని వెల్లడించారు.

రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని పేర్కొన్నారు. పోలింగ్‌ రోజు రాత్రి ఏడు గంటలకు ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పలు నిబంధనలు కూడా వెల్లడించారు. ఒక అభ్యర్థి ఒక పోస్ట్ కు మాత్రమే పోటీ చేయాలని, గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్‌లకు హాజరు కాకపోతే పోటీ చేసే అర్హత ఉండదని, 20 శాఖల అసోసియేషన్‌లలో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే `మా` ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారని తెలిపారు. 

`మా` ఎన్నికల్లో అధ్యక్షుడి కోసం ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నర్సింహరావు పోటీపడుతున్నారు. మరోవైపు ప్రకాష్‌ రాజ్‌ ఏకంగా తన ప్యానెల్‌ని ప్రకటించారు. అధ్యక్ష పోటీలో ఉన్న హేమ, జీవిత రాజశేఖర్‌ కూడా ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లో ఉన్నారు. వీరితోపాటు బండ్ల గణేష్‌ జనరల్‌ సెక్రెటరీ పోస్ట్ కోసం పోటీ పడుతున్నట్టు ప్రకటించారు.
 

click me!