
గతంలో పోల్చితే మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రధాన పోటీదారులైన మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. ఇక ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఎన్నికలను మరింత రసవత్తరంగా మార్చేశారు. పెద్దల సపోర్ట్ నాకు అవసరం లేదు, వాళ్ళ సపోర్ట్ తో గెలిస్తే, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవాలి, అనుకున్నది చేయలేము అని ప్రకాష్ కామెంట్స్ చేయగా, మంచు విష్ణు మాత్రం పరిశ్రమలోని పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు.
మంచు విష్ణు బాలకృష్ణ, కృష్ణలను ఇప్పటికే కలిశారు. నేడు ఆయన పరిశ్రమ పెద్దలలో ఒకరు, మా క్రమశిక్షణా సంఘంలో కీలక పాత్ర వహిస్తున్న కృష్ణం రాజును కలిశారు. ఆయనతో ఫోటో దిగడంతో పాటు, రియల్ రెబెల్ స్టార్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అంటూ ట్విట్టర్ పోస్ట్ చేశారు.
ఇక మెగా ఫ్యామిలీ తమ మద్దతు ప్రకాష్ రాజ్ కి ప్రకటిస్తూ ఉండగా, పరిశ్రమలోని మిగతా పెద్దలు మంచు విష్ణుకు మద్దతు తెలుపుతున్నారు. మోహన్ బాబు ఈ విషయంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి కుటుంబంలో ఎవరు పోటీకి దిగినా నేను మంచు విష్ణును ఎన్నికలలో పోటీ చేయవద్దని చెప్పేవాడినని, చిరంజీవి కుటుంబం మాత్రం విష్ణుకు వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నారు అన్నారు. అదే సమయంలో గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.