'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' : చూడకుండా తమిళనాడులో కుట్ర?

By Udaya DFirst Published Apr 4, 2019, 12:48 PM IST
Highlights

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం  ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. 

 ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం  ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. ఈ చిత్రం కోర్ట్ తీర్పుతో ఆంధ్రలో రిలీజ్ కాలేదనే సంగతి తెలిసిందే. దాంతో అవకాసం ఉన్నవాళ్లు హైదరాబాద్ , చెన్నై లలో చూస్తున్నారు. చాలా మంది పైరసీ ప్రింట్ చేస్తున్నారు.

ముఖ్యంగా ఏపీలోని ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల వారికి చెన్నైకి వచ్చి సినిమా చూసే అవకాశం ఉందన్న కారణంతో ఒక పథకం ప్రకారం ఈ చిత్రాన్ని తొక్కేస్తున్నారని తెలుస్తోంది.  ఈ  చిత్రంపై కావాలని తమిళనాడులోనూ కుట్రలు జరుగుతున్నట్లు మీడియాలతో కథనాలు వస్తున్నాయి. 

ఏదో రిలీజ్ చేసాం అంటే చేసాం అన్న పేరుకు  సినిమాను రిలీజ్‌ చేసి రెండురోజుల్లో ఎత్తివేసేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా సినిమా రిలీజుకు ముందు సత్యం థియేటర్‌ కాంప్లెక్స్‌లో విడుదలయ్యే చిత్రాల జాబితాను దినపత్రికలకు విడుదల చేస్తుంటారు. విడుదలకు ముందు రోజు చిత్రం పేరును జాబితాలో పెట్టి వెంటనే ‘హోల్డ్‌’ అని ఉంచటం హాట్ టాపిక్ గా మారింది. 

మిగతా సిటీల్లో ఈ చిత్రం నాలుగు షోలతో 30 నుంచి 90 థియేటర్ల వరకు ప్రదర్శితం అవుతుండగా చెన్నైలో ఐదు నుంచి పది థియేటర్లలో మాత్రమే ప్రదర్శిస్తించటం వివాదం అవుతోంది. ఈ ధియోటర్లలో  రెండు, మూడు మినహా మిగిలిన థియేటర్లలో ఒకే షో, అది కూడా మార్నింగ్ షో, మాట్నీ మాత్రమే ప్రదర్శిస్తున్నారు. ఈరోజుంటే రేపు లేకుండా చేస్తూ థియేటర్లను, వేళలను తరచూ మారుస్తూండటం జరుగుతోంది. 

ఇక హౌస్‌ఫుల్‌గా సాగుతున్నా షోల సంఖ్య లేదా థియేటర్ల సంఖ్య పెంచడం లేదని ఆ పత్రిక రాసుకొచ్చింది. చెన్నై మినహా సరిహద్దు జిల్లాల్లో మరెక్కడా ప్రదర్శితం కాలేదు.  అంతేకాకుండా చెన్నైలోని ప్రముఖ దినపత్రికల్లో ప్రచురితమయ్యే సినిమాల జాబితాలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం చూడాలనుకునే ప్రేక్షకులను గందరగోళానికి గురిచేయడం ద్వారా చంద్రబాబుకు మేలు చేయాలని చిత్రరంగంతో పరిచయం ఉన్న కొందరు తెలుగు ప్రముఖుల కుట్రలు చేస్తున్నారని ఆ పత్రిక కథనం రాసుకొచ్చింది. 

click me!