
ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజిత్ రూపొందిస్తోన్న చిత్రం 'సాహో'. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లే చిత్రబృందం కూడా సినిమా స్థాయిని రోజురోజుకి పెంచేస్తుంది.
దాదాపు 150 కోట్లతో తెరకెక్కనున్న ఈ సినిమాలో కేవలం యాక్షన్ సీన్స్ కోసమే యాభై కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారని సమాచారం. యాక్షన్ సీక్వెన్సెస్ కోసం హాలీవుడ్ నుండి ప్రముఖ నిపుణులను తీసుకొచ్చారు.
తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం హాలీవుడ్ బ్యూటీని తీసుకొస్తున్నట్లు సమాచారం. పాప్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బ్రిటీష్ భామ కైలీ మినోగ్.. 'సాహో'లో స్పెషల్ సాంగ్ లో నటించడానికి అంగీకరించిందట.
దాదాపు పదేళ్ల క్రితం అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'బ్లూ' అనే సినిమాలో కైలీ స్పెషల్ సాంగ్ చేసింది. మళ్లీ ఇంతకాలానికి మరో ఇండియన్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న 'సాహో' ఈ ఏడాదిలో ఆగస్ట్ 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.