Sirivennela: సిరివెన్నెల పాటనే సినిమాగా తీసిన కృష్ణవంశీ.. జీవిత సారాన్ని వివరించిన ఆ పాట ఏంటంటే..?

By team teluguFirst Published Nov 30, 2021, 7:32 PM IST
Highlights

Sirivennela Seetharaama Sastry: తెలుగు సినీ జగత్తులో వెన్నెల కురిపించిన ఆ పాటల విహారి కలం మూగవోయింది. సుదీర్ఘకాలం తెలుగు ప్రేక్షకులను తన పాటలతో రంజింపజేసిన ఓ సాహిత్య మేధావిని తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోయింది. సిరివెన్నెల మరణం చిత్ర పరిశ్రమకే కాదు.. సాహితీ లోకానికి తీరని లోటు.

మాములుగా సినిమా పాటలంటే ఒక దర్శకుడు..  పాటల రచయితకు ఓ సిట్యుయేషన్ ను చెప్పి దానికి తగ్గట్టుగా గీతం రాయించుకుంటాడు. అయితే ఇప్పుడొస్తున్న ఆ పాటలు.. కథను పక్కదారి పట్టించడమే గాక కథాసారాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్లుతున్నాయి లెండి.. అది వేరే విషయం. కానీ సిరివెన్నెల పాట అలా కాదు. అది సినిమాలోని  భావాన్ని వినిపిస్తుంది. కథను డామినేట్ చేయకుండా.. భావం చెడకుండా.. అర్థవంతంగా ఉంటుంది. సినిమాలో అంతర్లీనంగా  ఉన్న విషయాన్ని అర్థమయ్యే రీతిలో చెబుతుంది. అలాంటి ఎన్నో పాటలను రాసిన సిరివెన్నెల పాటనే ఓ దర్శకుడు సినిమా తీశాడనే విషయం తెలుసా..? జీవిత సారాన్ని వినిపించిన ఆ  పాటతో ఓ అగ్ర దర్శకుడు.. మరో అగ్రహీరోతో సినిమా తీశాడు. ఇంతకీ ఆ పాటేంటంటే.. 

‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది.. సంసార సాగరం నాది.. సన్యాసం, శూణ్యం నావే..’.. యంగ్ రెబల్ స్టార్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకుడిగా 2005లో తెరకెక్కిన ఈ సినిమా కథ అంతా ఈ పాట చుట్టే తిరుగుతుంది. సిరివెన్నెల గతంలో రాసిన పాట ఆధారంగా వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 

ఖడ్గం తర్వాత కృష్ణవంశీకి అనుకున్న హిట్లు రాలేదు. ఆ తర్వాత వరుసగా డేంజర్, శ్రీ ఆంజనేయం తో వరుస ప్లాఫ్ లు వచ్చాయి. ఆ సమయంలో కొద్దిగా నిరాశకు  లోనైన  వంశీ.. ఓసారి సిరివెన్నెల దగ్గరికి వెళ్లారట. వంశీ-సిరివెన్నెల సంబంధం గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభ సినిమా గులాబీ నుంచి నిన్నా మొన్నటి గోవిందుడు అందరి వాడేలే సినిమా వరకు ఆయన సిరివెన్నెలతో వందలాది పాటలు రాయించుకున్నారు. కాగా.. డేంజర్ పరాజయం తర్వాత సిరివెన్నెల దగ్గరకు  వెళ్లిన వంశీకి.. సిరివెన్నెల ఓ పాట వినిపించారు. అదే జగమంత కుటుంబం నాది.. 

 

ఆ పాట విన్న కృష్ణవంశీ.. ఇందులో సినిమా తీయగల సత్తా ఉందని దాని ఆధారంగానే కథను తయారుచేయించాడు. ఆ పాట మూలకథను బేస్ చేసుకుని క్యారెక్టర్లను అల్లుకున్నాడు.  ఆ పాటలో అన్నట్టు.. ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది.. ’ సినిమాలో ప్రభాస్ అందరి ముఖాల్లో నవ్వులు నింపాలని  ప్రయత్నిస్తుంటాడు. కానీ తాను మాత్రం ఒంటరే. తనకు క్యాన్సర్ ఉన్న విషయాన్ని దిగమింగుతూ.. జనాలకు సంతోషాన్ని పంచాలని భావిస్తాడు. అదే.. ‘మంటల మాటున వెన్నెల నేనై.. వెన్నెల పూతల మంటను నేనై..’ అనే వ్యాక్యాలు. ఇక ఈ పాటలో సిరివెన్నెల సాహిత్య సునామీనే సృష్టించాడు.

 

పలు సందర్భాలలో కృష్ణవంశీ ఈ విషయం గురించి బహిరంగంగానే స్పందించారు. సిరివెన్నెల దగ్గర ఇలాంటి పాటలు వందలాదిగా ఉన్నాయని చెప్పారు. అయితే ఈ సినిమా అంతగా విజయం సాధించకపోయినా జగమంత కుటుంబం నాది పాట మాత్రం ఎవర్ గ్రీన్. ఈ పాటకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు కూడా ఇచ్చింది.  

click me!