
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్. వాల్తేరు వీరయ్య లాంటి రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి ఒక రీమేక్ చిత్రాన్ని ఎంచుకున్నారు. భోళా శంకర్ చిత్రం తమిళ బ్లాక్ బస్టర్ వేదాళంకి రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. క్రిటిక్స్, ఆడియన్స్ రియాక్షన్ ఆశాజనంకంగా లేదు. దీనితో భోళా శంకరుడికి బాక్సాఫీస్ వద్ద ఎదురీత తప్పదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం.. రీమేక్ చిత్రాన్ని చిరు ఎందుకు అంగీకరించారు ఇలా సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సడెన్ గా ట్రెండింగ్ గా మారారు. కొరటాల శివ చిరుతో ఆచార్య చిత్రం తెరకెక్కించినప్పుడు ఇదే తరహాలో ట్రోలింగ్, విమర్శలు ఎదుర్కొన్నారు.
కొరటాల శివ ఆచార్య చిత్రాన్ని తెరకెక్కించిన విధానంపై మెగా ఫ్యాన్స్ తీవ్ర విమర్శలే చేశారు. అయితే ఇప్పుడు భోళా శంకర్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తుండడంతో నెటిజన్లు కొరటాల శివతో లింక్ పెడుతూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. భోళా శంకర్ చిత్రాన్ని ట్రోల్ చేస్తున్నారు. కథ యాక్షన్ పార్ట్ అటుంచితే.. మంచి హాస్య భరితమైన సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో లేవని.. ఈ టైంలో కొరటాల రియాక్షన్ ఇదే అంటూ పలు పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.
అలాగే చిరు.. మెహర్ రమేష్ కి ఛాన్స్ ఇవ్వడం పై కూడా సెటైర్లు పేలుతున్నాయి. సినిమా నిరాశపరిచి విధంగా ఉంది కాబట్టి ఇలాంటి ట్రోలింగ్ సహజమే అని కామన్ ఆడియన్స్ అంటున్నారు. కొందరు మెగా అభిమానులైతే చిరు వెంటనే రీమేక్ చిత్రాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని.. తన కాస్ట్యూమ్ డిజైన్ టీమ్ ని కూడా వెంటనే మార్చేయాలని కోరుతున్నారు.