
హీరో విశాల్ ఇటీవల తరచుగా వార్తల్లో ఉంటున్నాడు. సినిమాలు, వ్యక్తిగత వివాదాలతో విశాల్ వార్తల్లోకెక్కిన చూస్తున్నాం. విశాల్ తెలుగు తమిళ భాషల్లో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో. విశాల్ ని తెలుగు ప్రేక్షకులు ఇక్కడి నటుడిగానే ప్రేమ కురిపిస్తారు.
ప్రస్తుతం విశాల్ నటిస్తున్న తాజా చిత్రం మార్క్ ఆంటోనీ. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ఎస్ జె సూర్య నటిస్తున్నాడు.దీనితో ఆడియన్స్ లో వీరిద్దరి కాంబినేషన్ పై ఆసక్తి పెరిగిపోయింది. ఆధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. స్టార్ మ్యూజిక్ కంపోజర్ జివి ప్రకాష్ బాణీలు అందిస్తున్నారు. సెప్టెంబర్ 15న విడుదలవుతున్న ఈ చిత్రం కోసం విశాల్ ప్రమోషన్స్ మొదలు పెట్టాడు.
ఈ చిత్ర షూటింగ్ లో తాను తృటిలో చావు నుంచి తప్పించుకున్నట్లు విశాల్ తెలిపాడు. సెట్స్ లో నాకు పెద్ద ప్రమాదమే తప్పింది. అది నాకు పునర్జన్మ లాంటి సంఘటన. ఫైట్ సీన్ ముగించి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక పెద్ద ట్రక్కు నా వైపు వచ్చింది. సరిగ్గా ఆ సమయానికి నేను దానిని గమనించాను. దీనితో ఆ ట్రక్కు బలంగా సెట్ ని ఢీ కొట్టింది. అదృష్టం కొద్దీ ట్రక్కు నుంచి తాను తప్పించుకున్నాను అని విశాల్ తెలిపారు.
ఆ తర్వాత పది నిమిషాల పాటు నేను తేరుకోలేదు. సిబ్బంది వచ్చి అడిగినా 10 నిముషాలు నన్ను మాట్లాడించవద్దని చెప్పాను. అంత భయాన్ని కలిగించింది అని విశాల్ తెలిపాడు. ఇక ఈ చిత్రంలో విశాల్ తో పాటు ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. సూర్య గారిని చూసి తాను చాలా విషయాలు నేర్చుకున్నట్లు విశాల్ తెలిపాడు. సూర్య తనని సొంత తమ్ముడిలా చూసుకున్నారు అని విశాల్ అన్నారు. అందరూ హీరో కోసం వెతుకుతుంటారు. నేను మాత్రం సూర్య కోసం వెతుకుంటాను అని విశాల్ చెప్పడం విశేషం.