
పొన్నియిన్ సెల్వన్ కోసం కోలీవుడ్ మొత్తం ఏకమైంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిర్వహించారు. రజినీకాంత్, కమల్ హాసన్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ గ్రాండ్ ఈవెంట్ కి కోలీవుడ్ మొత్తం తరలి వచ్చింది. ఒక పెద్ద అవార్డు ఫంక్షన్ ని పొన్నియిన్ సెల్వన్ ట్రైలర్ అండ్ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ తలపించింది. దేశం మొత్తం తమ వైపు తిరిగి చూసేలా ఈవెంట్ నిర్వహించారు.
కోలీవుడ్ ఇంత భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించడం వెనుక ప్రధాన ఉద్దేశం మూవీ విజయం. సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసి అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా మలచాలని భావిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పొన్నియిన్ సెల్వన్ విజయం కోలీవుడ్ పరువుకు సంబంధించిన మేటర్ గా భావిస్తున్నారు. ఒకప్పుడు సౌత్ సినిమా అంటే తమిళ సినిమానే. కె బాలచందన్, మణిరత్నం, శంకర్ వంటి దర్శకులు తమిళ చిత్ర పరిశ్రమ కీర్తిని దేశవ్యాప్తం చేశారు. మూడు దశాబ్దాల క్రితమే బాలీవుడ్ లో తమిళ చిత్రాలు సత్తా చాటాయి.
ఓ దశాబ్దకాలంగా ఆధిపత్యం మారిపోయింది. ఒకప్పుడు సౌత్ సినిమా అంటే తమిళ్ అనేవారు. ఇప్పుడు తెలుగు అంటున్నారు. దేశంలోనే అతిపెద్ద చిత్ర పరిశ్రమగా తెలుగు సినిమా ఎదిగింది. రాజమౌళి లాంటి దర్శకుల కృషితో తెలుగు సినిమా కీర్తి విశ్వవ్యాప్తమైంది.టాలీవుడ్ కి చెందిన బాహుబలి, బాహుబలి 2, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టాయి. అదే సమయంలో కోలీవుడ్ నుండి ఈ రేంజ్ మూవీ పడలేదు. ఒకటి రెండు ప్రయత్నాలు జరిగిన విఫలం అయ్యాయి.
భాషాభిమానం, ప్రాంతాభిమానం మెండుగా ఉండే తమిళులకు ఇది సహించని విషయమే. బాహుబలిని బీట్ చేసే సినిమా మేము తీయగలం, తీసి చూపిస్తామని వారెప్పటి నుండో శబధం చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ తో కోలీవుడ్ సత్తా ఏమిటో చాటాలని చూస్తున్నారు. దీనిలో భాగంగా కోలీవుడ్ అంతా కలిసి పొన్నియిన్ సెల్వన్ కి ప్రచారం కల్పిస్తున్నారు. కనీవినీ ఎరుగని విజయం నమోదు చేస్తామంటున్నారు. పరిశ్రమలో ఇలాంటి పోటీతత్త్వం ఉన్నప్పుడే గొప్ప చిత్రాలకు నాంది పడుతుంది.
అయితే తెలుగువాళ్ళకు ఇలాంటి పట్టింపులు ఉండవు. సినిమా బాగుంటే భాషాబేధం లేకుండా ఆదరిస్తారు. పొన్నియిన్ సెల్వన్ లో విషయం ఉంటే తెలుగువారు నెత్తిన పెట్టుకుంటారు. రికార్డు వసూళ్లు కట్టబెడతారు. దానికి కమల్ హాసన్ లేటెస్ట్ రిలీజ్ విక్రమ్ తెలుగు వసూళ్లు నిదర్శనం. అలాగే తెలుగు ప్రేక్షకులు మంచి చిత్రాల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. కోలీవుడ్ కి చెందిన పది మంది హీరోలు తెలుగులో మార్కెట్ సంపాదించుకున్నారు. కానీ ఇక్కడి స్టార్ హీరోలకు కూడా కోలీవుడ్ లో కనీస మార్కెట్ ఉండదు. అంత సంకుచిత మనస్తత్వం తమిళ ఆడియన్స్ సొంతం. ఏది ఏమైనా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ మంచి అనుభూతిని పంచే చిత్రం కావాలని తెలుగు ఆడియన్స్ కోరుకుంటున్నారు.