
కథ...
కిట్టు(రాజ్‌తరుణ్) మెకానికల్ ఇంజనీర్. స్నేహితులతో కలసి ఓ గ్యారేజీ నడుపుతుంటాడు. అనుకోకుండా జానకి(అను ఇమ్మాన్యుయేల్)ని కలుస్తాడు. ఆమె మంచితనం నచ్చడంతో ప్రేమిస్తాడు. జానకి కోసమే అనుకోకుండా కుక్కల కిడ్నాపర్ అవతారం ఎత్తుతాడు. ఈ విషయం జానకికి తెలిసిపోతుంది. దాంతో కిట్టూ, జానకి విడిపోతారు. మరోవైపు ఏఆర్(అర్ఫాజ్‌ఖాన్) సెలబ్రెటీలను బ్లాక్‌మెయిల్ చేస్తూ వారి ద్వారా తన అవసరాలను తీర్చుకుంటుంటాడు. ఈ నేపథ్యంలో ఐటీశాఖ ఏఆర్ ఇంటిపై దాడి చేస్తుంది. బ్లాక్‌మెయిల్ చేయాలనుకున్న సెలబ్రెటీల జాబితా ఉన్న లాకర్‌ను ఐటీ ఆఫీసర్(నాగేంద్రబాబు) సీజ్ చేసి తీసుకెళ్లిపోతాడు. దీంతో ఐటీ ఆఫీసర్ కుమార్తె అయిన జానకిని ఏఆర్ కిడ్నాప్ చేయిస్తాడు. ఆ నేరం కిట్టుపై పడుతుంది. దాని నుంచి కిట్టు ఎలా బయటపడ్డాడు? జానకిని ఏ విధంగా బయటకు తీసుకొచ్చాడు. తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే...
తొలి అర్ధభాగం కుక్కలను కిడ్నాప్ చేయటం, కిట్టు -జానకిల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలతో నడుస్తుంది. ముఖ్యంగా కుక్కలను కిడ్నాప్ చేసే సన్నివేశాలు సరదాగా సాగిపోతుంటాయి. విరామానికి ముందు కిట్టు-జానకి విడిపోవడం, జానకి అపహరణకు గురికావడంతో కథలో ఆసక్తి మొదలవుతుంది. ఇక ద్వితీయార్ధంలో ప్రతీ సన్నివేశమూ కీలకమే. రచయిత అందించిన కథను తెరపై చూపించడంలో దర్శకుడి పనితనం కనిపిస్తుంది. కథానాయికను కాపాడుకునే విధానం, అందుకోసం హీరో చేసే ప్రయత్నాలు, కన్‌ఫ్యూజన్ డ్రామా మొదలైనవన్నీ చక్కగా పండాయి. రేచీకటి ఉన్నా, దాన్ని కవర్ చేసుకునే పాత్రలో పృథ్వీ నటన అలరిస్తుంది. దొంగబాబాగా రఘుబాబు, నవ్విస్తాడు. కాకపోతే ఆ పాత్రను మరీ సాగదీసినట్టు అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు సుదీర్ఘంగా సాగాయి. విలన్ పాత్ర చివరకు తేలిపోయింది. ఐటీశాఖ సీజ్ చేసిన లాకర్‌ను తీసుకెళ్లేపోయే ఎపిసోడ్ సిల్లీగా చూపించారు. కథలో కొత్తదనం లేకపోయిన సన్నివేశాల్లో వినోదం జోడించటంతో సినిమా సాఫీగా సాగిపోతుంటుంది.
నటీనటులు...
రాజ్‌తరుణ్ మరోసారి ఎనర్జిటిక్ పాత్రలో కనిపించారు. నటనలో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ గత సినిమాలకూ, ఈ సినిమాలకీ పెద్ద తేడా లేదు. ఈ సినిమాలో ఓ పాట కూడా రాయడం విశేషం. అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్‌గా కనిపించింది. అయితే పెద్దగా ప్రాధాన్యం లేదు. అర్ఫాజ్‌ఖాన్ పాత్రను చివరికి తేల్చేశారు. ఆ పాత్రకు చెప్పిన డబ్బింగ్ బేస్ వాయిస్ కావడంతో అక్కడక్కడా మాటలు అర్థం కావు. నాగబాబు, వెన్నెల కిషోర్, రాజా రవీంద్ర తమ తమ పాత్రల్లో ఓకే అనిపిస్తారు. అయితే ఎక్కువగా నవ్వులు పంచింది మాత్రం పృథ్వీనే.
సాంకేతిక నిపుణులు...
అనూప్‌రూబెన్స్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ఐటమ్ సాంగ్ అంతగా కిక్ ఇవ్వలేదు. నేపథ్యం సంగీతం సినిమాకు తగినట్టు సాగింది. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అక్కడక్కడా అలరిస్తాయి. కెమేరా, ఎడిటింగ్ అన్నీ సమపాళ్లలో కుదిరాయి.
ప్లస్ పాయింట్స్...
కుక్కలను కిడ్నాప్ చేసే సన్నివేశాలు, పృథ్వీ వినోదం, సెకండాఫ్
మైనస్ పాయింట్స్...
హీరో, హీరోయిన్ ల మధ్య నడిచే లవ్ ట్రాక్, క్లైమాక్స్ సన్నివేశాలు
చివరగా...
'కిట్టు' కుక్కలు కిడ్నాప్ చేస్తూ అలరిస్తాడు.