
కథ...
ఎర్ర శ్రీను (విజయ్ దేవరకొండ) ఒక దొంగ…తన స్నేహితులు (పృథ్వి, రఘు బాబు) తో కలిసి గుడిలోని కృష్ణుడు విగ్రహం దొంగతనం చేయాలని స్కెచ్ వేస్తారు. అందుకోసం వారు ద్వారక అనే అపార్ట్‌మెంట్‌లోకి ఎంట్రీ ఇస్తారు. ఆ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లిన శ్రీను కృష్ణనందస్వామిగా అనే దొంగ బాబాగా మారతాడు. అక్కడ మంచి పేరు తెచ్చుకుని ఆ తర్వాత వారిని నమ్మించి కృష్ణుడు విగ్రహం దొంగతనం చేయాలని ప్లాన్ చేస్తాడు.
అదే టైంలో వీరి మోసాల గురించి తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ (ప్రకాష్ రాజ్) సాక్షాలతో నిరూపించి..వారిని పట్టుకోవాలని అనుకుంటాడు. కృష్ణ నంద స్వామి దగ్గరికి వచ్చిన ఒక భక్తురాలు కూతురు హీరోయిన్ (పూజ ఝవేరి)తో మన దొంగ బాబా అలియస్ ఎర్ర శ్రీను ప్రేమలో పడతాడు. హీరోయిన్‌కు మాత్రం ఈ బాబాను దొంగ బాబా అని అనుమానించడంతో పాటు అతడిపై ఏ మాత్రం నమ్మకం ఉండదు.
ఈ బాబాను బూచీగా చూపి ఓ ట్రస్ట్ ముఠా రూ.2 కోట్లను కాజేయాలని ప్లాన్ వేస్తుంది. ఈ హీరో బాబా కాదని నిరూపించేందుకు ఓ నాస్తికుడు అక్కడకు వస్తాడు. ఓ వైపు తాను ప్రేమించిన హీరోయిన్, తనపై అనుకోకుండా వచ్చిన కేసు, ముఠా, పోలీసులు, మరో వైపు నాస్తికుడు ఇలా వీరందరి మధ్యలో ఇరుక్కున్న దొంగబాబా అలియాస్ ఎర్ర శ్రీను చివరకు తన బాబా నాటకానికి ఎలా తెరదించాడు అన్నదే ఈ సినిమా స్టోరీ.
ఎలా ఉందంటే...
ఇది మంచి హుషారైన సినిమా. దొంగ శ్రీను దొంగ బాబాగా ఎలా మారాడు ? దొంగ బాబా దొంగ విన్యాసాలు, ఓ వైపు భక్తుల మూడభక్తి, మీడియా హంగామా, దొంగ బాబా గుట్టు రట్టు చేసేందుకు నాస్తికులు చేసే ప్రయత్నాలు, పృథ్వి కామెడీ, హీరోయిన్ హీరోను చూసి అనుమానించడం…వాడు బాబా ఏంటి…వాడి చూపే అదోలా ఉందని అనుమానించడం…ఇలా సినిమా అంతా కామెడీని ఎంజాయ్ చేసేలా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో పుంజుకున్న సినిమాను సెకండాఫ్‌లో నడిపేందుకు చెప్పుకోదగ్గ కథ లేకపోయినా కామెడీతో దర్శకుడు చక్కగా బండి లాగించేశాడు.
పెళ్లిచూపులు తర్వాత విజయ్ దేవరకొండకు నటనా పరంగా ఇది మంచి స్కోప్ ఉన్న సినిమా. ఆ సినిమాకు ఈ సినిమాకు నటనాపరంగా చాలా వ్యత్యాసం చూపించాడు. హీరోయిన్ ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేసింది. పృథ్వితో పాటు కామెడీ గ్యాంగ్ నవ్వులు పువ్వులు పూశాయి. ప్రకాశ్‌రాజ్ పాత్ర చిన్నదే అయినా సినిమాకు కీలకం. విజయ్,పూజ కెమిస్ట్రీ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.
సాంకేతిక నిపుణులు...
సాంకేతిక నిపుణుల్లో ముందుగా చెప్పుకోవలసింది సినిమాటోగ్రఫీ. ఈ సినిమాకు విజువల్స్ సూపర్. పాటలు ఆన్‌స్క్రీన్ మీద అదరగొట్టాయి. దర్శకుడు రవీంద్ర పాత కథనే వైవిధ్యంగా డిఫరెంట్ కామెడీ ఫార్మాట్‌లో తెరకెక్కించి విజయ్‌కు మరో హిట్ ఇచ్చాడు. అయితే సెకండాఫ్ స్లోగా ఉంటూ బోర్ కొట్టినా… ఓవరాల్‌గా కామెడీ అలరిస్తుంది.
ప్లస్ పాయింట్స్...
దొంగ బాబాగా విజయ్ నటన
విజయ్, పూజా జవేరి మధ్య సన్నివేశాలు
కామెడీ, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్...
బోరింగ్ సెకండాఫ్
బలమైన విలన్ లేకపోవడం
చివరగా...
కథ పాతదే... కామెడీ కొత్తదనంతో ద్వారక