
ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ సక్సెస్ లు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కిర్రాక్ పార్టీ. కన్నడలో సూపర్ హిట్ అయిన కిరిక్ పార్టీ సినిమాను తెలుగులో కిరాక్ పార్టీ పేరుతో రీమేక్ చేశాడు నిఖిల్. శరన్ కొప్పిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా నిఖిల్ కు మరో సక్సెస్ సాధించాడా..?
కథ :
కృష్ణ (నిఖిల్ సిద్ధార్థ్) మెకానికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. తన ఫ్రెండ్స్‌తో కలిసి కాలేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. కాలేజ్ బంక్ కొట్టడం, గొడవలు చేయటం ఇదే కృష్ణ లైఫ్. ఆ సమయంలో సీనియర్ మీరాను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఎలాగైన తనకు దగ్గరకావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా తన లైఫ్ తాను ఎంజాయ్ చేసే కృష్ణను మీరా కూడా ఇష్టపడుతుంది. కానీ అనుకోండా ఓ ప్రమాదంలో మీరా చనిపోతుంది. మీరాను ప్రాణంగా ప్రేమించిన కృష్ణ, పూర్తిగా మారిపోతాడు. కాలేజ్ లో అందరితో గొడవపడుతూ రౌడీలా మారిపోతాడు. మూడేళ్లు గడిచిపోతాయి. కృష్ణ గ్యాంగ్ ఫైనల్ ఇయర్‌కు వస్తుంది. కృష్ణ హీరోయిజం చూసి జూనియర్ సత్య (సంయుక్త హెగ్డే) కృష్ణను ఇష్టపడుతుంది. ఎలాగైన కృష్ణను మామూలు మనిషిగా మార్చాలని, జీవితంలోని కొన్ని చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ముందుకు సాగాలని గుర్తు చేయాలనుకుంటుంది. మరి సత్య ప్రయత్నం ఫలించిందా..? కృష్ణ మీరాను మర్చిపోయి సత్యకు దగ్గరయ్యాడా..? ఈ కాలేజ్ లైఫ్ కృష్ణకు ఎలాంటి అనుభవాలను ఇచ్చింది..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
కృష్ణ పాత్రలో నిఖిల్ మంచి నటన కనబరిచాడు. స్టూడెంట్ గా తనకు అలవాటైన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో మెప్పించటంతో పాటు సెకండ్ హాఫ్‌లో మెచ్యూర్డ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. లుక్ విషయంలోనూ మంచి వేరియేషన్ చూపించాడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో పాటు క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో నిఖిల్ నటన చాలా బాగుంది. సినిమా సినిమాకు మంచి పరిణతి కనబరుస్తున్నాడు నిఖిల్. ఫస్ట్‌హాఫ్ లో హీరోయిన్ గా కనిపించిన సిమ్రాన్ హుందాగా కనిపించింది. సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. మరో హీరోయిన్ సంయుక్త హెగ్డే బబ్లీ గర్ల్ గా కనిపించి సెంకడ్‌హాఫ్ లో జోష్ నింపే ప్రయత్నం చేసింది. బ్రహ్మాజీది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో మంచి కామెడీ పండించాడు. ఫ్రెండ్స్ పాత్రలో కనిపించిన నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించి మెప్పించారు.
విశ్లేషణ :
తెలుగులో ఈ తరహా కథలు చాలా కాలం క్రితమే వచ్చాయి. హ్యాపిడేస్ లాంటి సినిమాలు సంచలనాలు సృష్టించాయి. మరోసారి అదే తరహా కాలేజ్ డేస్‌ను గుర్తు చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు శరన్. అయితే ఎక్కడా కొత్తదనం కనిపించకపోవటం నిరాశపరుస్తుంది. అక్కడక్కడ కథనంలో మెరుపులు కనిపించినా.. గతంలో తెలుగు తెర మీద వచ్చిన చాలా కాలేజ్ సినిమాల ఛాయలు కనిపిస్తాయి. కన్నడ ప్రేక్షకులకు ఈ తరహా కథలు కొత్త అయినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం రొటీన్ ఫార్ములా సినిమాలాగే అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగున్నా, కథనం నెమ్మదిగా సాగటం ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి రొటీన్ కథను చెప్పటడానికి 2 గంటల 45 నిమిషాల సమయం తీసుకున‍్న దర్శకుడు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. ఒరిజినల్ వర్షన్ కు సంగీత మందిచిన అజనీష్ తెలుగు వర్షన్‌కు కూడా మంచి సంగీతాన్ని అందించాడు. పాటలు అలరిస్తాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
హీరో నిఖిల్ కృష్ణ పాత్రలో బాగానే నటించాడు. మొదటి సంవత్సరం చదివే కుర్రాడిగా సరదగా, ఎనర్జిటిక్ గా కనిపిస్తూనే కాలేజ్ సీనియర్ గా రఫ్ అండ్ టఫ్ లుక్లో కూడ మెప్పించాడు. సినిమా ఫస్టాఫ్ ఎక్కువ భాగం స్నేహితుల మధ్య, కాలేజీలో జరిగే సరదాగా సన్నివేశాలతో, చిన్నపాటి లవ్ ట్రాక్ తో నడుస్తూ ఇంప్రెస్ చేసింది. సంగీత దర్శకుడు అంజనీష్ లోకనాథ్ అందించిన పాటల సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ ఇంప్రెస్ చేశాయి.
స్నేహితుల మధ్యన నడిచే పాట, హీరో హీరోయిన్ల నడుమ సాగే రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకున్నాయి. హీరో స్నేహితుల పాత్రలో నటించిన యువకులు కూడ ఎక్కడా లిమిట్స్ దాటకుండా సెటిల్డ్ గా పెర్ఫార్మ్స్ చేసి సినిమాకు రియలిస్టిక్ లుక్ వచ్చేలా దోహదపడ్డారు. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాలు ఎమోషనల్ గా ఉండి ఆకట్టుకున్నాయి.
సుధీర్ వర్మ రాసిన ఫస్టాఫ్ స్కీన్ ప్లే బాగుంది. ద్వితీయార్థంలో వచ్చే కొన్ని ఫన్నీ సీన్స్, హీరో ఆకట్టుకోగా సినిమా యొక్క కాలేజ్ నైపథ్యం యువతకు తమ కాలేజీ రోజుల్ని తప్పక గుర్తు చేస్తుంది.
మైనస్ పాయింట్స్ :
సినిమాకు ప్రధాన మైనస్ చెప్పుకోడానికి బాగేనా ఉండే స్టోరీ లైన్ ను ఒక సినిమాకు కావాల్సిన పూర్తిస్థాయి మెటీరియల్ అందించే విధంగా తయారుచేయలేకపోవడమే. ఇంటర్వెల్ సమయానికి బలంగా బయటపడే కథను దర్శకుడు శరన్ కొప్పిశెట్టి సెకండాఫ్ మొత్తం అంతే బలంగా నడపడంలో పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రథమార్ధానికి మంచి స్క్రీన్ ప్లే అందించిన సుధీర్ వర్మ ద్వితీయార్థానికి ఆ స్థాయి కథనాన్ని ఇవ్వలేదు.
సెకండాఫ్లోని కీలకమైన సన్నివేశాలు చాలా వరకు రొటీన్ గానే అనిపిస్తాయి. కొన్నైతే చాలా బలహీనంగా కూడ ఉంటాయి. దీంతో చూసే ప్రేక్షకుల్లో కొంత నిరుత్సాహం ఆవరిస్తుంది. విరామ సమయానికి అసలు కథ ఓపెన్ అయినా ద్వితీయార్థంలో అదెక్కడా పెద్దగా కనిపించదు. కాలేజ్ ఎలక్షన్స్, గొడవలు అంటూ సినిమా సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. పోనీ ఆ అంశాలనైనా ఎఫెక్టివ్ గా చూపించారా అంటే పేలవమైన సన్నివేశాలతో అరకొరగా చూపించి వదిలేశారు.
దాంతో కథానాయకుడి పాత్ర యొక్క గమ్యం, వ్యక్తిత్వం ఏమిటనేది క్లారిటీగా తెరపై కనబడదు. ఇక ఇంటర్వెల్ ఉన్నంత బలంగా ముగింపు ఉండదు. చిన్న ఎమోషన్, ఒక ఫన్నీ సీన్ తో నార్మల్ గానే ముగిసిపోతుంది.
చివరగా: పొరపాట్లు లేకుంటే యువతకు బాగా కనెక్ట్ అయ్యేది