Kesari-2 Movie: కేసరి-2 సినిమా ప్రీమియర్ షోను దేశంలోని అయిదు నగరాల్లో ప్రదర్శించారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు పెట్టిన నిమిషాల వ్యవధిలోనే అన్ని అమ్ముడుకావడం విశేషం. ఇక ఈ సినిమాను అనేక మంది సెలబ్రిటీలతోపాటు, రాజకీయ నాయకులు కూడా చూశారు. జలియన్‌వాలాబాగ్ ఘటన ఆధారంగా తీసిన కేసరి-2 చూసిన ప్రతి ఒక్కరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమాను ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా చూసి ఏమన్నారంటే..
జలియన్‌వాలాబాగ్ ఘటన జరిగింది కేవలం పది నిమిషాలు మాత్రమే... పది నిమిషాల్లో ఆంగ్లేయులు భారతీయులపై కాల్పులకు దిగి వేల మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటన ఆధారంగా కేసరి-2 సినిమాను చిత్రీకరించారు. మూవీ నిడివి రెండు గంటలు ఉండగా.. సినిమా ప్రారంభం నుంచి భావోద్వేగం.. కళ్లలో నీటితోనే సినిమాను చూస్తామని ప్రీమియర్ చూసిన వారు చెబుతున్నారు. అంతేకాదు ఆనాడు ఎంత ఘోరంగా మారణకాండ జరిగిందో అన్నది కలలో కూడా గుర్తుకు తెచ్చుకోకూడదని అందరూ ఇప్పటికీ చెప్పుకుంటారు.
ఇక కేసరి-2 సినిమా చూసిన తర్వాత ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీడియాతో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన కేసరి-2 చూసి భావోద్వేగానికి గురైనట్లు ఆమె తెలిపారు. సినిమా ఆసాంతం కళ్లలో నీళ్లు ఉన్నాయని అన్నారు. వారి ప్రాణ త్యాగం చూసిన తర్వాత తన జీవితాన్ని కూడా మాతృభూమికి అంకితం చేయాలనుందన్నారు.
సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని, ఇప్పటికే ఆరోజు జరిగిన ఘటనలో ప్రాణాలుకోల్పోయిన వారి పేర్లు తెలియదని.. వారి త్యాగం వల్లే ఈనాడు స్వేచ్చ, స్వాతంత్రాలను అనుభవిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. దేశ స్వేచ్ఛ కోసం లక్షల మంది ప్రాణాలను త్యాగం చేసి చరిత్రలో నిలిచిపోయారన్నారు. సినిమా అందరి గుండెకు హత్తుకుంటుందని, వారి ప్రాణ త్యాగం చూసిన తర్వాత తన శరీరాన్ని, మనసును, జీవితాన్ని దేశానికి అంకితం చేస్తానన్నారు. ఇలాంటి గొప్ప సినిమా తీసిన చిత్రయూనిట్‌ను అభినందించారు. సినిమా చివరి వరకు భావోద్వేగంతోనే వీక్షించినట్లు సీఎం తెలిపారు. సీఎం రేఖా గుప్తా వ్యాఖ్యలపై అక్షయ్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు.
తెలుగులో కూడా విడుదల..
కేసరి-2 సినిమాను తెలుగు హీరో రానా కూడా చూశాడు. ఇలాంటి సినిమా అన్ని భాషల్లో విడుదల కావాలని, తెలుగులో కూడా విడుదల చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకురానుంది. 2019లో తొలి సినిమా కేసరి విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. 1897లో సిక్కు సైనికులు 10 వేల మంది ఆఫ్ఘన్లతో ఏవిధంగా పోరాడారో అన్న నేపథ్యంలో కేసరి సినిమా తీసి అన్నివర్గాల నుంచి ప్రశంసలు అందుకున్నారు.