
`మహానటి`తో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యింది కీర్తిసురేష్(Keerthy Suresh). ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రకి ప్రాణం పోసి నటించింది. పాత్రలో జీవించింది. నేటి తరానికి సావిత్రి ఎవరంటే కీర్తిసురేష్ ముఖమే గుర్తొస్తుందంటే అతిశయోక్తి కాదు. అంతగా పాత్రకి వెండితెరపై ప్రాణం పోసింది కీర్తిసురేష్. దీంతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో సౌత్‌లోనే కాదు, నార్త్ లోనూ కీర్తిసురేష్‌కి మంచి గుర్తింపు వచ్చింది. విపరీతమైన క్రేజ్ కూడా వచ్చింది.
అయితే ఆ తర్వాత కీర్తికి ఆ స్థాయి సినిమాలు పడలేదు కదా, మంచి విజయాలు కూడా దక్కలేదు. ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద పరాజయం చెందడం గమనార్హం. తమిళంలో నటించిన `సర్కార్` సినిమా ఫర్వాలేదనిపించింది. కానీ ఆమె చేసిన `స్వామి స్క్వైర్`, `పందెంకోడి 2`, `పెంగ్విన్`, `మిస్ ఇండియా`, `రంగ్ దే`, `అన్నాత్తే`, `మరక్కర్` చిత్రాలన్ని పరాజయం చెందాయి. దీంతో కీర్తి నటనని ఆవిష్కరించే సరైన పాత్రలు, సరైన కథలు పడలేదు.
ఈ నేపథ్యంలో Keerthy Suresh ప్రస్తుతం `గుడ్ లక్ సఖీ`(Good Luck Sakhi), `సర్కారు వారి పాట`, `సాని కాయిదమ్`, `భోళాశంకర్`, `వాషి` చిత్రాలు చేస్తుంది. వీటిలో ఇమ్మీడియెట్‌గా విడుదల కాబోతున్న సినిమా `గుడ్ లక్ సఖీ`. జాతీయ అవార్డు చిత్రాల దర్శకుడు నాగేష్ కుకునూర్ రూపొందించిన చిత్రమిది. ఇందులో ఆదిపినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోసిస్తున్నారు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం మొదటి లాక్ డౌన్‌కి ముందే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఫైనల్‌గా డిసెంబర్ 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వాయిదా వేశారు. డిసెంబర్ 31న రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించారు.
ఈ చిత్రంలో కీర్తిసురేష్ మెయిన్ రోల్ చేస్తుంది. ఆమె పాత్ర చుట్టూతే సినిమా కథ తిరుగుతుంది. కొద్ది రోజుల్లో పెళ్లి కావాల్సిన ఓ పేద కుటుంబానికి చెందిన అమ్మాయి కాబోయే భర్త యాక్సిడెంట్‌లో చనిపోతే, ఆమె షార్స్ షూటింగ్‌లో ట్రైన్ అయి నేషనల్ వైడ్‌గా షార్ప్ షూటర్‌గా ఎలా రాణించింది. ఈ క్రమంలో ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో చాలా బలమైన పాత్రని పోషిస్తుంది కీర్తిసురేష్.
ఆమె మెయిన్ రోల్స్ చేసిన `పెంగ్విన్`, `మిస్ ఇండియా` సినిమాలు పరాజయం చెందాయి. దీంతో `గుడ్‌లక్ సఖీ`పై ఆశలు పెట్టుకుంది కీర్తి. పైగా ఆమె నటించిన సినిమాలన్నీ పరాజయం చెందడంతో `మహానటి`తో వచ్చిన ఇమేజ్, క్రేజ్ తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుందీ ట్రెడిషనల్ బ్యూటీ. మళ్లీ ఈ సినిమాతో తాను పూర్వ వైభవం పొందుతుందా? పోయిన క్రేజ్‌ని తిరిగి రాబట్టుకోగలుగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఇది ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే వరుసగా కీర్తిసురేష్ చెల్లి పాత్రలు పోషిస్తుంది. ఆమె ఇటీవల రజనీకాంత్ నటించిన `అన్నాత్తే`లో ఆయనకు చెల్లిగా నటించింది. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న `భోళాశంకర్`లోనూ కీర్తి చిరుకి చెల్లికిగా చేస్తుంది. దీంతో ఇప్పుడు కీర్తిసురేష్ అంటే చెల్లి పాత్రలకే ఫిక్స్ అయిపోతుందా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. హీరోయిన్‌గా మంచి స్వింగ్‌లో ఉన్న సమయంలో ఇలా చెల్లి పాత్రలు పోషిస్తున్న ఆడియెన్స్ లో అదే ముద్ర పడిపోతుంది. దీంతో తర్వాత ఆమెని హీరోయినగా రిసీవ్ చేసుకోవడం కష్టంగా మారుతుంది. మరి కీర్తిసురేష్ విషయంలో ఏం జరుగుతుంది, హీరోయిన్ పాత్రలు, ఇలాంటి భిన్నమైన పాత్రలు చేస్తూ కెరీర్‌ని బ్యాలెన్స్ చేసుకుంటుందా? లేక `చెల్లి` ఎఫెక్ట్ తన సినిమాలపై పడుతుందా? అన్నది సస్పెన్స్ గా మారింది.