
మణికొండలోని ల్యాంకోహిల్స్ అపార్ట్మెంట్లో వరుసగా మూడు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలు స్థానికులను దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. 28 ఏళ్ల బిందుశ్రీ అనే యువతి మరణంతో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. పూర్ణచంద్ రావు అనే నటుడు బిందుశ్రీని వేధింపులకు గురి చేశాడని, ఇతర యువతులను సినిమా అవకాశాల పేరుతో మోసం చేస్తున్నట్లు తెలిసింది.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూర్ణచంద్ రావు గతంలో కొన్ని కన్నడ సినిమాల్లో నటించాడు. ఓ పదేళ్ల క్రితం హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యాడు. ఇక్కడ హోమ్ థియేటర్స్ బిజినెస్ చేస్తున్నాడు. మణికొండ ల్యాంకోహిల్స్ అపార్ట్మెంట్ లో భార్య, కూతురితో పాటు నివాసం ఉంటున్నాడు. బిందుశ్రీ అనే యువతిని కూతురు కేర్ టేకర్ గా నియమించుకున్నాడు. బిందుశ్రీ అక్కడే మరో గదిలో ఉంటుంది. ఈ క్రమంలో బిందుశ్రీతో పూర్ణచంద్ రావు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో గొడవలు జరుగుతున్నాయి. కూతురు కేర్ టేకర్ గా మరో యువతిని పూర్ణచంద్ రావు నియమించాడు. దీంతో శుక్రవారం రాత్రి బిందుశ్రీ-పూర్ణచంద్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. అదే రోజు రాత్రి బిందుశ్రీ ల్యాంకోవర్ అపార్ట్మెంట్ 21వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. సెక్యూరిటీ సిబ్బంది రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు.
పోలీసుల విచారణలో పూర్ణచంద్ రావు దారుణాలు వెల్లడయ్యాయి. ఇతడు కన్నడ సినిమాల్లో నటించాని చెప్పుకుంటూ... యువతులను ట్రాప్ చేస్తున్నాడు. తరచుగా అతని నివాసానికి యువతులు వచ్చిపోతూ ఉండేవారట. సినిమా ఆఫర్స్ ఇప్పిస్తానని పూర్ణచంద్ రావు యువతులను మోసం చేస్తున్నట్లు సమాచారం. బిందుశ్రీ పూర్ణచంద్ రావు వేధింపుల కారణంగానే మరణించినట్లు తెలిసింది. బిందుశ్రీ తండ్రి ఫిర్యాదుతో పూర్ణచంద్ రావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.