
లోకనాయకుడు కమల్ హాసన్ ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయన ఆనందాన్ని పట్టలేకున్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత వచ్చిన హిట్ అది. కమల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో వచ్చిన కమల్ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. విడుదలైన తొలి రోజే రూ. 45 కోట్లకు పైగా రాబట్టిన విక్రమ్...వీకెండ్ తర్వాత కూడా ఎక్కడా వెనకడుగు వేయటం లేదు. దుమ్ము రేపుతున్నారు.
ఈ నేపథ్యంలో కమల్‌కు ఇలాంటి విజయాన్నిచ్చిన యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఆయన ప్రశంసల జల్లు కురుపించారు. మొదటి నుంచి లోకేష్ ప్రతిభను కొనియాడుతున్న కమల్.. తాజాగా అతడికి ఒక లేఖ రాశాడు. తమిళంలో రాసిన ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లేఖలో ఏముందంటే...
లోకేష్ తన అభిమానిగా తనను కలిసి.. ఇలాంటి సినిమా తీయడంపై కమల్ ప్రస్తావించాడిందులో. మామూలుగా తన అభిమానులు మిగతా వాళ్లతో పోలిస్తే వైవిధ్యంగా ఉండాలని, వాళ్ల ఆలోచన స్థాయి ఎక్కువగా ఉండాలని తాను కోరుకుంటానని.. ఐతే విమర్శకులు ఈ విషయంలో అంత స్వార్థం ఉండకూడదని అంటుంటారని.. కానీ లోకేష్ అనే తన అభిమాని ఇప్పుడు ‘విక్రమ్’ లాంటి సినిమా తీసి తనను గర్వించేలా చేశాడని.. అందుకు అతణ్ని అభినందించడానికి తగ్గ మాటలు కూడా రావట్లేదని కమల్ వ్యాఖ్యానించడం విశేషం. లోకేష్ ఈ విజయాన్ని తలకెక్కించుకోకుండా నేలమీదే ఉండి కష్టపడితే అతడికి మరిన్ని విజయాలు దక్కుతాయని కమల్ అన్నాడు.
ఈ లెటర్ విషయంలో లోకేష్ చాలా ఎగ్జైట్ అయ్యాడు. తన ‘ఖైదీ’ సినిమాలో ఫేమస్ డైలాగ్ అయిన ‘లైఫ్ టైం సెటిల్మెంట్’ డైలాగ్‌ను దీనికి అన్వయిస్తూ ఇది లైఫ్ టైం సెటిల్మెంట్ అప్రిసియేషన్‌గా అతను అభివర్ణించాడు. మరో ప్రక్క కమల్ హాసన్ అభిమానులు ఇప్పుడు మామూలు ఆనందంలో లేరు. అందుక్కారణం.. విక్రమ్. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ప్రకంపనలు రేపుతోంది.
ఇదిలా విక్రమ్ మూవీ భారీ విజయం అందుకోవడంతో కమల్ హాసన్ డైరెక్టర్‌కు సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఖరీదైన లెక్సాస్ లగ్జరీ కారును డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌కు, కమల్ బహుమతిగా అందించాడు. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్: హిట్ లిస్ట్' పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు. ఇందులో కమల్ 67 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా యాక్షన్ సీన్స్ చేయడం విశేషం.