స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొడుకు నీల్ కిచ్లు (Neil Kitchlu) జన్మించి ఏడాది పూర్తయ్యింది. దీంతో నీల్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా చేశారు. స్టార్ హీరోయిన్లు స్పందిస్తూ స్టార్ కిడ్ కు విషెస్ తెలుపుతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) మొదటి లాక్ డౌన్ లోనే పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. 2020 అక్టోబర్ 30న ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు (Gautam Kitchlu)తో కాజల్ వివాహం జరిగింది. ముంబైలో కుటుంబ సభ్యులు, ముఖ్యమైన అథితుల మధ్య వివాహ వేడుక ముగిసిన విషయం తెలిసిందే. ఆ కొద్దినెలలో ప్రెగ్నెన్సీని సైతం ప్రకటించిందీ స్టార్ బ్యూటీ. గతేడాది ఏప్రిల్ 19న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాజల్ తన కొడుకుకు Neil Kitchluగా నామకరణం చేశారు.
కాజల్ మదర్ గా ప్రమోషన్ తీసుకున్నప్పటి నుంచి తన భర్త, కొడుకుతో ఎంత సంతోషంగా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు నీల్ కిచ్లుతో ఫొటోషూట్లు కూడా చేస్తూ వచ్చింది. కొడుకు నుంచి ప్రేమను పొందుతూ.. గారాభంగా చూసుకుంటూ చాలా సార్టు పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. ఇక నిన్నటితో నీల్ కిచ్లు జన్మించి ఏడాది పూర్తైయ్యింది. దీంతో నీల్ కిచ్లు ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. అలాగే కిచ్లు ఏడాది పూర్తి చేసుకున్నారంటూ.. తాము పేరెంట్స్ గా ఏడాది పూర్తి చేసుకున్నామని తెలిపింది. తన ముద్దుల కొడుకు నీల్ కిచ్లు క్యూట్ ఫొటోను అభిమానులతో పంచుకుంది.
దీంతో స్టార్ కిడ్ నీల్ కిచ్లుకు రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా, హన్సిక, మంచు లక్ష్మి తదితర స్టార్ హీరోయిన్లు బెస్ట్ విషెస్ తెలిపారు. క్యూట్ బేబీ అంటూ పొగడ్తలు కురిపించారు. అటు కాజల్ అభిమానులు కూడా నీల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాజల్ పెట్టిన పోస్ట్ కు లైక్స్, కామెంట్లు పెడుతూ నెట్టింట వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. కేరీర్ లో ఫుల్ బిజీగా మారిపోతోంది. రీసెంట్ గా తమిళ చిత్రం ‘ఘోస్టీ’తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం కాజల్ చేతిలో భారీ చిత్రాలు ఉన్నాయి. కమల్ హాసన్ - శంకర్ కాంబోలోని ‘ఇండియన్ 2’లో నటిస్తోంది. అలాగే బాలయ్య సరసన NBK108లో నటిస్తున్న విషయం తెలిసిందే. మున్ముందు మరిన్ని ప్రాజెక్ట్స్ ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.