
తారకరత్న మరణ విషాద ఛాయలు అంత త్వరగా నందమూరి ఫ్యామిలీని, అభిమానులని విడిచిపెట్టేలా లేవు. అతి పిన్న వయసులోనే నందమూరి తారకరత్న మరణించడంతో కుటుంబ సభ్యుల్లో తీరని వేదన మిగిల్చింది. అభిమానులు సైతం శోకంలో మునిగిపోయారు. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు.
కాగా నేడు తారకరత్న పెద్ద కర్మని కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్ద కర్మలో నందమూరి కుటుంబ సభ్యులు, ఇతర సెలెబ్రిటీలు పాల్గొని తారక రత్నకి మరోసారి నివాళులు అర్పించారు. బాలకృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని ముందుండి చూసుకునట్లు తెలుస్తోంది. తారక రత్న మరణించినప్పుడు బాలయ్య ఎంతగా వేదన చెందారో అందరికి తెలిసిందే.
ఈ పెద్ద కర్మలో కూడా బాలయ్య తారకరత్న ఫ్యామిలీని పరామర్శించారు. ముఖ్యంగా తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డికి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. నారా చంద్రబాబు నాయుడు, విజయసాయి రెడ్డి, బాలకృష్ణ , నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇంకా ఇతర ప్రముఖులు పెద్ద కర్మకు హాజరై తారకరత్నకి నివాళుళు అర్పించారు.
అయితే పెద్ద కర్మలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ అందరితో పాటు కూర్చుని ఉన్నారు. ఇంతలో బాలకృష్ణ అటువైపుగా రావడంతో వెంటనే నందమూరి సోదరులు ఇద్దరూ లేచి నిల్చున్నారు. బాలయ్యకి గౌరవంగా అబ్బాయిలు ఒకేసారి లేచి నిలబడడంతో ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అవుతోంది. కుటుంబ పెద్దల పట్ల ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ చూపిస్తున్న గౌరవం అభిమానులకు సంతోషాన్నిస్తోంది. ఈ వీడియోపై నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.