
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను తమన్నా ప్రేమిస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. తరచుగా వీరిద్దరూ కలిసి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి. 2023 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సైతం కలిసి జరుపుకున్నారనే వాదన ఉంది. కొన్ని ఆధారాలు బయటకు తీస్తూ... విజయ్ వర్మ-తమన్నా డేటింగ్ చేస్తున్నారని మీడియా కథనాలు ప్రచురించడం జరిగింది.
ఈ వార్తలపై తమన్నా ఎట్టకేలకు స్పందించారు. ఇవన్నీ నిరాధార కథనాలని ఖండించారు. ఈ వార్తలు ఎవరు రాస్తారో అర్థం కాదు. ఈ పుకార్లు నా వరకూ కూడా వచ్చాయి. విన్నాక ఫన్నీగా అనిపించింది. ప్రతి ఒక్కరికీ జీవితం ఉంటుంది. నా జీవితంలో ఎంతో ప్రేమ పొందాను...అని తమన్నా వివరణ ఇచ్చారు. అభిమానుల నుండి అపరిమితమైన ప్రేమను అనుభవించానని పరోక్షంగా చెప్పిన తమన్నా, తనకు ఎలాంటి ఎఫైర్స్ లేవని క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం తమన్నా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. చిరంజీవికి జంటగా భోళా శంకర్ చిత్రం చేస్తున్నారు. ఆయనతో తమన్నాకు ఇది రెండో చిత్రం. గతంలో వీరిద్దరూ సైరా చిత్రం కోసం జతకట్టారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. తమిళ హిట్ చిత్రం వేదాళం రీమేక్ గా తెరకెక్కుతుంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్ర చేయడం విశేషం.
అలాగే రజినీకాంత్ కి జంటగా జైలర్ చిత్రం చేస్తున్నారు. కెరీర్లో ఫస్ట్ టైం ఆమె రజినీకాంత్ సరసన నటిస్తున్నారు. దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో తమన్నా అడుగుపెట్టి దశాబ్దన్నర కాలం అవుతుంది. ఇప్పటికీ ఆమె క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటున్నారు. సౌత్ ఇండియాలో తమన్నాకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది.