2016లో నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి మూడు క్రేజీ సినిమాల పోటీని తట్టుకుని కూడా సోగ్గాడే చిన్నినాయనా సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.
ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాల మధ్య ఓ చిన్న సినిమాలా బంగార్రాజు వస్తుందనుకుంటే.. ఇప్పుడు అదే ఓ పెద్ద సినిమాలా సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ఈ సినిమాతో పాటుగా రౌడీ బాయ్స్, హీరో లాంటి చిన్న సినిమాలు కూడా పండక్కి ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. అయితే ప్రేక్షకుల దృష్టి ప్రధానంగా బంగార్రాజు మీదే ఉంటుందనడంలో సందేహం లేదు. కాకపోతే కోవిడ్ నిబంధనలు ఈ సినిమాని ఇబ్బంది పెడతాయని అందరూ భావించారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ అనౌన్స్ చేయటంతో థియేటర్లలో సెకండ్ షోలు వేసుకునే అవకాశం లేకపోయింది. అలాగే థియేటర్ల ఆక్యుపెన్సీని కూడా 50 శాతానికి తగ్గించేయడంతో బంగార్రాజుపై దెబ్బ పడినట్లే అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అనుకోనివిధంగా ఏపీలో నైట్ కర్ఫ్యూ వాయిదా వేశారు. సంక్రాంతి పండుగ తర్వాత కర్ఫ్యూ అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది అక్కడి ప్రభుత్వం. జనాల పండుగ సంతోషాన్ని దెబ్బ తీయకూడదన్న ఉద్దేశంతోనే నైట్ కర్ఫ్యూను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పండగ వేళల్లో ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తారు గనుక ఈ నెల 18వ తేదీ నుండి ఈ ఆంక్షలు ఉంటాయని తాత్కాలికంగా బ్రేకులు వేసింది. అయితే ఇదంతా నాగార్జున పై జగన్ కు ఉన్న అభిమానం అని ఓ వర్గం ప్రచారం మొదలెట్టేసింది. ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటమే కలిసి వచ్చిందంటున్నారు.
కరోనా ఆంక్షలు అమలు పరిస్తే ధియేటర్లలో 50% మాత్రమే ఆక్యుపెన్సీ ఉండాలి, వాటిని ఇప్పుడు సడలించడంతో 100% టికెట్లను మంజూరు చేయవచ్చు. పండగ నాలుగు రోజులు 100 శాతం ఆక్యుపెన్సీ హౌస్ ఫుల్స్ తో కళకళలాడినా “బంగార్రాజు” కొంత ఒడ్డున పడుతుందని ఇలా చేసారంటున్నారు.
మరో ప్రక్క టికెట్ రేట్లు తగ్గినా నాకు ఏ ఇబ్బంది లేదు..అంటూ కింగ్ నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఏపీలో టికెట్ ధరల నిర్ణయంతో ఇండస్ట్రీ వారు సంతృప్తికరంగా లేరు. ఈ విషయంలో గతకొన్ని రోజులుగా ఏపీ మంత్రులకు ఇండస్ట్రీ వారికి మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు అప్పుడు కొందరు తప్పు పట్టినప్పటికీ ఇప్పుడు ఆయన మాట్లాడిందే కరెక్ట్ అని చెబుతున్నారు. ఇటీవల ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి తన ఆవేదనను వ్యక్తం చేశారు. నాగార్జున మాత్రం...ఏపీలో టికెట్ రేట్ల విషయంలో నా సినిమాకు ఇబ్బంది ఏమీ ఉండదని చెప్పడం ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరమైన చర్చలకు తావిచ్చింది.
గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందింది. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్స్. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించటం, ‘సోగ్గాడే..’కి ప్రీక్వెల్ కావటంతో ‘బంగార్రాజు’ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ''బంగార్రాజు'' నుంచి ఇప్పటికే విడుదలైన- పాటలు - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది.