
నందమూరి తారకరత్న మరణం కుటుంబ సభ్యుల్లో తీరని వేదన మిగిల్చింది. అభిమానులు సైతం శోకంలో మునిగిపోయారు. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు. నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభంలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసిందే. కుప్పంలో చికిత్స అనంతరం బెంగుళూరుకి తరలించారు. వైద్యులు ఎంతగానో శ్రమించినా ఫలితం లేకపోయింది.
నందమూరి బాలకృష్ణ బాబాయ్ స్థానంలో ఉండి తారకరత్నని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. ఆసుపత్రిలో చికిత్సని, టైం టూ టైం తారక రత్న హెల్త్ కండిషన్ ని వైద్యులని అడిగి తెలుసుకుంటూ వచ్చారు. బాలకృష్ణ, కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నించినా తారకరత్న ప్రాణాలు దక్కలేదు.
తారక రత్నకి బాబాయ్ బాలకృష్ణ అంటే ప్రాణం కన్నా మిన్న. బాబాయ్ పై అంత ప్రేమ కురిపిస్తాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తారక రత్న బాలయ్యకి సంబంధించిన ఒక టాటూ చేతిపై వేయించుకున్నాడు. బాలకృష్ణ ఎప్పుడూ తనతోనే ఉండాలి అనే ఉద్దేశంతో తారక రత్న ఆ టాటూ వేయించుకున్నాడు. బాలకృష్ణ అంటే ఒక సింహం లాంటి మనిషి. కాబట్టి సింహం బొమ్మని టాటూగా వేయించుకుని దాని కింద బాలకృష్ణ సంతకాన్ని కూడా టాటూగా వేయించుకున్నాడు.
ఎప్పటికైనా బాబాయ్ బాలకృష్ణతో నటించాలని తారకరత్న అంటుండేవారు. ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారకరత్న ఒక కీలక పాత్రలో నటించేందుకు చర్చలు కూడా మొదలయ్యాయట. కానీ అది పూర్తి స్థాయిలో జరిగేలోపే తారకరత్న తుదిశ్వాస విడిచారు. బాలయ్య విషయంలో తారకరత్నకు అది తీరని కోరికగానే మిగిలిపోయింది.