
97వ అకాడమీ అవార్డుల వేడుక ఎప్పటిలాగే గ్రాండ్ గా జరిగింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఆస్కార్ 2025 వేడుకని నిర్వహించారు. ఆస్కార్స్ లో ఉత్తమ నటి, నటుడిగా అవార్డులు గెలుచుకున్న వారి గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ది బ్రూతలిస్ట్ చిత్రంలో నటనకి గాను ఆడ్రిన్ బ్రాడీకి ఉత్తమ నటుడిగా ఆస్కార్ దక్కింది.
ఆడ్రిన్ బ్రాడీ 1973లో న్యూయార్క్ లో జన్మించారు. అతని వయసు ప్రస్తుతం 51 ఏళ్ళు. 1989లోనే ఆడ్రిన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బుల్లితెరపై కూడా నటించాడు. ఆస్కార్ ని ముద్దాడుతున్న సమయంలో అడ్రిన్ ఎమోషనల్ అయ్యారు. ఆస్కార్ అవార్డు అందుకోవడంతో తన గమ్యం చేరుకున్నట్లు అనిపిస్తోంది అని తెలిపారు. మరో గమ్యానికి ఇది ప్రారంభం. నాతోపాటు నామినేట్ అయిన వారికీ కూడా శుభాకాంక్షలు. నటన అనేది గ్లామరస్ గా కనిపిస్తుంది కానీ దానికి చాలా లక్షణాలు ఉంటాయి అని ఆడ్రిన్ తెలిపారు. వేదికపై నుంచి తన స్నేహితులు, తల్లిదండ్రులకు ఆడ్రిన్ కృతజ్ఞతలు తెలిపారు.
51 ఏళ్ళు వయసు ఉన్నప్పటికీ ఆడ్రిన్ ఇంతవరకు వివాహం చేసుకోలేదు. కానీ రొమాంటిక్ జీవితాన్ని మాత్రం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆడ్రిన్ 48 ఏళ్ళ వయసున్న జార్జినా చాప్ మెన్ అనే నటితో సహజీవనం చేస్తున్నారు. వేదికపై నుంచి ఆమెకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. తన గురించి ఆడ్రిన్ బ్రాడీ మాట్లాడుతున్న సమయంలో జార్జినా ఎమోషనల్ అయ్యారు.
జార్జినాకి ఆల్రెడీ పెళ్లి జరిగింది. ఆమె మాజీ భర్త ఎవరో కాదు.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని శిక్ష అనుభవించిన హెర్వి విన్స్టైన్. అతడి లైంగిక వేధింపుల వల్లే మీటూ ఉద్యమం మొదలయింది. తన భర్తపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో జార్జినా అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత 2020 నుంచి ఆమె ఆడ్రిన్ తో సహజీవనం చేస్తోంది.
ఇక ఆస్కార్స్ లో ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న నటి మైకీ మాడిసన్. గ్లామర్ డాల్ లాగా ఉండే ఈ పాతికేళ్ల యంగ్ బ్యూటీ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం ఆకర్షిస్తోంది. అనోరా అనే చిత్రానికి గాను మైకీ మాడిసన్ కి ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ యంగ్ బ్యూటీ లాస్ ఏంజిల్స్ లో పుట్టి పెరిగింది. 2017లో మైకీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనోరా మూవీ ఆమెకి కేవలం 9 వ చిత్రం మాత్రమే.