
పవర్ స్టర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు. తన సినిమాలకు చేసిన అన్యాయాన్ని ఆయన ప్రస్తావించారు. తనపై కక్షకట్టి టికెట్ రేట్లు తగ్గించారని, తనని ఆర్థికంగా దెబ్బతీయాలని కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. తనపై దాడులు చేసే క్రమంలో ఏపీలో సినిమా టికెట్ రేట్లు తగ్గించారని, అందుకు అర్థరాత్రి జీవో తీసుకొచ్చారని పవన్ ఆరోపించారు.
ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడం వల్ల `భీమ్లా నాయక్` సినిమాకి ఏకంగా 30కోట్ల నష్టం వచ్చిందన్నారు. `వకీస్ సాబ్` సమయంలోనూ అదే జరిగిందన్నారు పవన్. సినిమా టికెట్ ధర పది రూపాయలు పెడితే పెట్టిన బడ్జెట్ ఎప్పటికి తిరిగి వస్తుంది? అన్ని ప్రశ్నించారు. `నా రెండు సినిమాలు పెద్ద హిట్ కానీ, ఏపీలో నిర్మాతలకు నష్టం వచ్చింది. ఆ భారం నేనే భరించాను` అని వెల్లడించారు పవన్. తన కార్యకర్తలతో ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ నటించిన `భీమ్లా నాయక్` చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. గతేడాది ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదలైంది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా వంద కోట్లు దాటింది. కానీ ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో అక్కడ కలెక్షన్లు బాగా తగ్గాయి. దీంతో నిర్మాతలకు, బయ్యర్లకి అక్కడ కొంత నష్టం వాటిల్లింది. ఇందులో రానా మరో ముఖ్య పాత్ర పోషించగా, సంయుక్త మీనన్, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటించారు.
ఇక `వకీల్ సాబ్` మూవీ 2021 ఏప్రిల్ 9న రిలీజ్ అయ్యింది. ఆ సమయంలో కరోనా ఎఫెక్ట్, మరోవైపు ఏపిలో టికెట్ రేట్ల తగ్గింపు కారణంగా హిట్ టాక్ వచ్చినా ఈ సినిమాకి సైతం ఏపీలో కలెక్షన్లు బాగా తగ్గాయి. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటించగా, అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రలు పోషించారు. `పింక్` చిత్రానికిది రీమేక్.