
`ఆదిపురుష్` సినిమా చుట్టూ వివాదాలు, ట్రోల్స్ రాజుకుంటున్నాయి. సినిమాని బ్యాన్ చేయాలంటూ కొందరు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. హిందూ మనోభావాలను కించపరిచేలా సినిమా ఉందని అంటున్నారు. అందులో భాగంగా సినిమాని నిషేధించాలని ఢిల్లీ హైకోర్ట్ లో ఏకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. `ఆదిపురుష్` సినిమాని బ్యాన్ చేయాలంటూ దాఖలైన ఈ పిల్‌ని అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్ట్ బుధవారం తిరస్కరించింది. అంత అర్జెంట్ ఏం లేదని వ్యాఖ్యానించడం విశేషం.
ఈ కేసుని న్యాయమూర్తులు తారా విటస్తా గంజు, అమిత్ మహాజన్‌ల వెకేషన్ బెంజ్ ముందు ప్రస్తావించారు. ఈ విషయంలో ఎలాంటి అత్యవసరం లేదని, జూన్ 30న విచారణ చేపడతామని కోర్ట్ వెల్లడించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది, హిందూ సేన్ బెంచ్‌కి మాట్లాడుతూ, సినిమాలో అనేక వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయని, అవి ఇతర దేశాలతో భారతదేశ సంబంధాలను కూడా ప్రభావితం చేస్తున్నాయని, ఈ సినిమా భారతదేశ అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితం చేస్తుందని, నేపాల్ కూడా ఈ చిత్రాన్ని నిషేధించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు.
అయితే సినిమా ఇప్పటికే విడుదలైందని, ఈ విషయంలో అత్యవసరం లేదని ధర్మాసనం వెల్లడించింది. `అర్జెంట్ ఏం లేదు సర్, దయజేసి జూన్ 30న తిరిగి రండి` అని జస్టిస్ గంజు అన్నారు. ఇక ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త ప్రధాన పాత్రలు పోషించిన `ఆదిపురుష్` చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. టీ సిరీస్,యూవీ క్రియేషన్స్ నిర్మించాయి. సుమారు ఐదు వందల కోట్లతో రూపొందిన ఈ సినిమా కలెక్షన్లు 400కోట్లకు చేరువలో ఉన్నాయి.
జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా సుమారు 9వేల స్క్రీన్లలో త్రీడీ, 2డీలో విడుదలైన ఈ చిత్రం మొదటి నుంచి నుంచి మిశ్రమ స్పందన రాబట్టుకుంది. అయినా వీకెండ్ వరకు భారీ కలెక్షన్లని సాధించింది. మూడు రోజుల్లో మూడు వందల కోట్లు దాటింది. సోమవారం నుంచి కలెక్షన్లు పడిపోయాయి. మరి ఈ వీకెండ్ వరకు ఈ కలెక్షన్ల మీద సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది.