
భగవద్గీత సారాంశం ఇప్పుడు ప్రపంచంలో నలువైపులా వ్యాపిస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ చిత్రాల్లో దర్శకులు భగవద్గీత అంశాల్ని జోడిస్తున్నారు. ఈ ఏడాది సంచలనం సృష్టించిన క్రిస్టఫర్ నోలెన్ ఓపెన్ హైమర్ చిత్రంలో భగవద్గీత శ్లోకాలని ఉపయోగించారు. అణుబాంబు పితామహుడు ఓపెన్ హైమర్ కి నిజంగానే భగవద్గీతలో ప్రావీణ్యం ఉంది. అదే విషయాన్ని తన చిత్రంలో నోలెన్ చూపించారు.
'నేను ఇప్పుడు లోకాలని నాశనం చేసే మృత్యువుగా మారాను' అనే డైలాగ్ ని ఓపెన్ హైమర్ లో చూడొచ్చు. ఇప్పుడు మరో హాలీవుడ్ మూవీలో ఉన్న భగవద్గీత రెఫెరిన్స్ వైరల్ గా మారింది. అది కూడా విన్ డీజిల్ లాంటి యాక్షన్ హీరో నోటి వెంట శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి.
గతంలో విన్ డీజిల్ నటించిన 'బిల్లీ లిన్స్ లాంగ్ హాఫ్ టైం వాక్' అనే చిత్రంలో భగవద్గీత ప్రస్తావన ఉంది. ఈ చిత్రంలో జో ఆల్విన్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ సన్నివేశంలో భాగంగా ఏదైనా సలహా ఇస్తావా అని అల్విన్ అడగగా విన్ డీజిల్ భగవద్గీత గురించి చెబుతాడు. 'ఏమీ ఆశించకుండా మన కర్తవ్యాలు చేయాలి. ఏదో ఒక కర్మ నువ్వు చేసి తీరాలి. దాని ఫలితాలని నాకు విడిచిపెట్టాలి. కురుక్షేత్ర యుద్దానికి ముందురోజు అర్జునుడు సంకోచిస్తున్నప్పుడు కృష్ణ భగవానుడు చెప్పిన మాటలు ఇవి అని విన్ డీజిల్.. ఆల్విన్ తో అంటాడు.
కృష్ణ ఎవరు అని ఆల్విన్ అడగగా.. మహావిష్ణు అవతారము, సుప్రీం గాడ్ అని డీజిల్ బదులిస్తాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
'బిల్లీ లిన్స్ లాంగ్ హాఫ్ టైం వాక్ చిత్రాన్ని ప్రసిద్ధి చెందిన ఒక నవల ఆధారంగా ఆస్కార్ అవార్డు గెలిచిన దర్శకుడు ఆంగ్ లీ తెరకెక్కించారు. లైఫ్ ఆఫ్ పై చిత్రాన్ని తెరకెక్కించింది కూడా ఈ దర్శకుడు. ఈ మూవీకే ఆంగ్ లీకి ఆస్కార్ అవార్డు దక్కింది.
బిల్లీ లిన్స్ లాంగ్ హాఫ్ టైం వాక్ చిత్రం కూడా యుద్ధ నేపథ్యంలోనే ఉంటుంది. ఇందులో ఆల్విన్ ఇరాక్ తో యుద్ధంలో బ్రేవో స్క్వాడ్ లో కీలక వ్యక్తిగా ఉంటాడు. యుద్ధం తర్వాత వీరికి వీరులుగా గుర్తింపు దక్కుతుంది. యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో అనే చర్చ జరుగుతున్నప్పుడు దర్శకుడు భగవద్గీత సన్నివేశాన్ని పెట్టారు.