
పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం చేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోగా సీరియస్ పొలిటీషియన్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. వరుస సినిమాలు చేస్తూనే పొలిటికల్ ఈవెంట్స్ లో బిజీగా ఉంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో జనసేనను బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఆయన బస్సు యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. అందుకోసం వారాహి అనే వాహనం కూడా సిద్ధం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి సమరానికి సై అంటున్నారు.
అందుకే పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తయ్యే రీమేక్స్ పైనే ఆసక్తి చూపుతున్నారని ఇండస్ట్రీ టాక్. పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. కమ్ బ్యాక్ అనంతరం పవన్ విడుదల చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రెండూ చిత్రాలు రీమేక్సే. అందులోనూ ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉన్న చిత్రాలను ఎంచుకున్నారు. ఇదే అనుకూలతలు వినోదయ సితం రీమేక్ కి ఉన్నాయి.సినిమా మొత్తం సాయి ధరమ్ తేజ్ ది. పవన్ పాత్ర ఎక్స్టెండెడ్ క్యామియోలా ఉంటుంది. 25 రోజులు మాత్రమే కేటాయించారట.
స్ట్రెయిట్ మూవీ హరి హర వీరమల్లు షూట్ నత్తనడక సాగుతుంటే, భవదీయుడు భగత్ సింగ్ పక్కన పెట్టేశారు. దాని స్థానంలో తేరి రీమేక్ తెచ్చారు. అదే ఉస్తాద్ భగత్ సింగ్. సుజీత్ తో ప్రకటించినది మాత్రం స్ట్రెయిట్ చిత్రం. కాగా నేడు వినోదయ సిత్తం పట్టాలెక్కించారు. ఈ విషయం తెలియజేస్తూ నిర్మాతలు ఫోటోలు షేర్ చేశారు. సదరు ఫొటోల్లో ఒకటి నెటిజెన్స్ ని ఆకర్షించింది.
ట్రెండీ అవుట్ ఫిట్ లో స్టైల్ గా కూర్చున్న పవన్ చేతిలో టీ గ్లాసు పట్టుకొని ఉన్నారు. అది జనసేన పార్టీ సింబల్ కావడంతో సినిమా ఈవెంట్ ని కూడా పరోక్షంగా పవన్ పొలిటికల్ పబ్లిసిటీ కోసం వాడేస్తున్నారన్న వాదన సోషల్ మీడియాలో మొదలైంది. అంత పెద్ద సినిమా ఆఫీస్ లో ఒక హీరోకి కాకా హోటల్ నుండి గాజు గ్లాసులో టీ అయితే తెప్పించరు. కాబట్టి ఇది పక్కా పవన్ పొలిటికల్ స్కెచ్ అంటున్నారు.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు...ఒక ఫొటోతో అటు సినిమా ఇటు రాజకీయ ప్రచారం చేస్తున్నారంటూ జనాలు విశ్లేషిస్తున్నారు. నిజానికి జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఎన్నికల సంఘం చాలా కాలం క్రితమే రద్దు చేసింది. ఆ గుర్తు ఇతరులకు కేటాయించినట్లు సమాచారం. అయినప్పటికీ జనసేన అదే గుర్తు కొనసాగిస్తున్నారని తెలుస్తుంది.