
యాక్షన్ హీరో గోపీచంద్ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని చిత్రాలు యావరేజ్ అవుతున్నాయి. కానీ కెరీర్ బిగినింగ్ లో పడ్డ హిట్స్ మాత్రం దక్కడం లేదు. దీనితో గోపీచంద్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. గోపీచంద్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం భీమా.
యాక్షన్ ఉంటూనే అందులో సూపర్ నేచురల్ అంశాలు జోడించి భీమా అనే చిత్రంతో రాబోతున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది. మార్చి 8న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ట్రైలర్ లోని అద్భుతమైన విజువల్స్ తో సినిమాపై ఆల్రెడీ పాజిటివ్ బజ్ ఏర్పడింది.
ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గోపీచంద్ తన గత చిత్రాల ప్రజాయాలపై కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా రామబాణం చిత్రం అంత దారుణమైన డిజాస్టర్ కావడం పై గోపీచంద్ కారణం చెప్పాడు. రామబాణం చిత్రంపై గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
కానీ పరమ రొటీన్ అంశాలతో తెరకెక్కిన రామబాణం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.ఈ చిత్ర రిజల్ట్ గురించి గోపీచంద్ మాట్లాడుతూ.. అందులో ఎమోషన్స్ వర్కౌట్ కాలేదు అని తెలిపారు. ఆ విషయం మధ్యలోనే అర్థం అయిపోయింది. కథ ఎంత పాతది అయినప్పటికీ ఎమోషన్స్ వర్కౌట్ అయితే రిజల్ట్ అంత దారుణంగా ఉండదు.
ఆ చిత్రాన్ని ప్రజెంట్ చేసిన విధానంలోనే లోపం జరిగింది అనిపిస్తోంది. ఆ విషయంలో డైరెక్టర్ శ్రీవాస్ ని తప్పుపట్టలేం. ఎందుకంటే ఇలా వర్క్ అవుతుందేమో అని ఆయన నమ్మారు. కానీ అది జరగలేదు. సినిమా ప్రారంభానికి ముందే నేను నా సలహాలు ఇస్తాను. ఒకసారి మూవీ ప్రారంభం అయిన తర్వాత నా ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని గోపీచంద్ తెలిపారు.