
ఆరడుగుల ఆజానుబాహుడు భల్లాల దేవుడు రానా దగ్గుబాటి నుంచి ఇటీవల సినిమాల స్పీడ్ తగ్గిందనే చెప్పాలి. బాహుబలి తర్వాత రానా నుంచి ఘాజి లాంటి పాన్ ఇండియా హిట్, అలాగే నేనే రాజు నేనే మంత్రి లాంటి పొలిటికల్ డ్రామా చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే ఫ్యాన్స్ కి మాత్రం కిక్ సరిపోలేదు.
రానా ఇంకా భారీ చిత్రాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎప్పటి నుంచే చర్చల్లో ఉన్న హిరణ్యకశ్యప చిత్రం ఇంతవరకు మొదలు కానేలేదు. అసలు ఆ మూవీ మొదలవుతుందా లేక అటకెక్కిందా అనే క్లారిటీ కూడా లేదు. రానా నుంచి ఏదైనా భారీ చిత్రం రావాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్న తరుణంలో ఒక ఆసక్తికర డెవెలప్ మెంట్ జరుగుతోంది.
రానాతో బాహుబలి నిర్మాతలు భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కబోతోందట. ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
విరూపాక్ష, పొలిమేర 2 లాంటి చిత్రాలు బ్లాక్ మ్యాజిక్, సూపర్ నేచురల్ అంశాలతో వచ్చి అదరగోట్టాయి. అదే తరహా కథని ఆర్కామీడియా సంస్థ భారీ బడ్జెట్ లో కళ్ళు చెదిరే విజువల్స్ తో తెరకెక్కించాలని భావిస్తోంది. రానా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా వెన్నులో వణుకు పుట్టించే కథని సిద్ధం చేశారట. దర్శకుడు ఎవరు ? ఇతర తారాగణం లాంటి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
బాహుబలి తర్వాత రానా మరోసారి ఆర్కా మీడియాతో చేతులు కలుపుతుండటంతో ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్రంలో రానాకి జోడిగా స్టార్ హీరోయిన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు మర్యాద రామన్న, పంజా లాంటి చిత్రాలు నిర్మించిన ఆర్కా సంస్థ బాహుబలి తర్వాత స్వరూపమే మారిపోయింది. టాలీవుడ్ లో భారీ నిర్మాణ సంస్థగా ఎదిగింది.