
స్టార్ హీరోయిన్‌గా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన శ్రీదేవిని మర్చిపోవటం కష్టమే. 2018లో ప్రమాదవశాత్తు ఈమె మరణించినప్పటికీ సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆమెని అభిమానులు ఏదో విధంగా గుర్తుచేసుకుంటున్నారు. ఇక ఈ రోజు శ్రీదేవి 60 పుట్టిన రోజు (జయంతి) సందర్భంగా ఇప్పుడు ఆమెకు గూగుల్ అరుదైన రీతిలో గౌరవించింది.
బాలీవుడ్ లో ఎందరు దక్షిణాది హీరోయిన్స్ రాజ్యమేలినా, సూపర్ స్టార్స్ కు సైతం దడ పుట్టించేలా శ్రీదేవి విజయాలను సాధించారు. ఆ తీరున బాలీవుడ్ లో అలరించిన మరో దక్షిణాది హీరోయిన్ కనపడదు. ఏది ఏమైనా శ్రీదేవి చలనచిత్ర జైత్రయాత్రలో తెలుగు సినిమాలదే సింహభాగం. శ్రీదేవి భౌతికంగా దూరమైనప్పటికీ ఆమె అభిమానుల గుండెల్లో చిరస్మరణీయురాలు.శ్రీదేవి ఎంతమంది సరసన హీరోయిన్ గా నటించినా యన్టీఆర్ తో నటించడమే ఓ ప్రత్యేకతగా నిలచింది.
ఎన్టీఆర్ సరసన 12 చిత్రాల్లో శ్రీదేవి హీరోయిన్ గా నటించారు. వాటిలో తొలి చిత్రం వేటగాడు సాధించిన విజయం గురించి సెన్సేషన్. ఎందుకంటే ఓ నటునికి మనవరాలిగా నటించి మెప్పించి, మళ్ళీ అదే నటుని సరసన హీరోయిన్ గా అలరించడం మామూలు విషయం కాదు. ఇక ఎన్టీఆర్ తో శ్రీదేవి నటనాప్రస్థానం ఓ చరిత్ర. వీరిద్దరూ కలసి నటించిన వేటగాడు, ఆటగాడు, సర్దార్ పాపారాయుడు, గజదొంగ, సత్యం-శివం, కొండవీటి సింహం, అనురాగదేవత, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి, వయ్యారిభామలు-వగలమారి భర్తలు చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి.
టీనేజ్‌లోనే హీరోయిన్ అయిపోయి.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. విరామం తర్వాత శ్రీదేవి 2012లో `ఇంగ్లీష్ వింగ్లీష్` చిత్రంతో తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. ఇక సినీరంగానికి శ్రీదేవి చేసిన కృషికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారం లభించింది. 2017లో క్రైమ్ థ్రిల్లర్ `మామ్`లో అద్భుత నట ప్రతిభతో ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును సంపాదించింది. .
ఇక 2002 లో సినిమాల నుండి విరామం తీసుకున్న ఆమె.. 2004 లో వచ్చిన మాలినీ అయ్యర్ అనే సీరియల్ తో టీవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో కొన్ని టీవీ ప్రోగ్రాంలకు జడ్జిగా కూడా వ్యవహరించారు. ఈమెకు మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన శ్రీదేవి.. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకుంది. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఈమె కుమార్తెలు.