
‘సినీ నటి కాజల్ అసలు పేరు సరోజ. ఆమెకు తమిళనాడులో ఒక కుటుంబం కూడా ఉంది. ఆ కుటుంబానికి ఆమే పెద్ద.’ ఏమిటిదంతా.. అనుకుంటున్నారా.. తమిళనాడు ప్రభుత్వం చేసిన ఓ పొరపాటు ఇది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆధార్ కార్డుల్లో తప్పులు దొర్లడం, ఓటర్ కార్డుల్లో.. ఫోటోలు తప్పుగా రావడం లాంటివి మనం చాలా చూశాం. అలాంటి తప్పిదమే మరోసారి ఎదురైంది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు ప్రభుత్వం ప్రజా పంపిణీ పథకంలో భాగంగా గతంలో జారీ చేసిన రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులను తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజా పంపిణీ శాఖ కొద్ది రోజులుగా లబ్ధిదారులకు స్మార్ట్‌కార్డులు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో సివిల్ సప్లయిస్ డిపార్ట్‌మెంట్ వాడుతున్న స్మార్ట్ టెక్నాలజీలో డొల్లతనం బయటపడింది.
ఒక మహిళకు జారీ చేసిన స్మార్ట్ కార్డులో ఆమె ఫొటోకి బదులు కాజల్ అగర్వాల్ ఫొటో వచ్చింది. సలేమ్ జిల్లాకు చెందిన సరోజ అనే ఇంటి పెద్ద పేరిట స్మార్ట్ రేషన్ కార్డును రెవెన్యూ అధికారులు జారీ చేశారు. ఆ స్మార్ట్ కార్డులో సరోజ ఫొటో బదులు కాజల్ అగర్వాల్ ఫొటో ఉంది. దీంతో ఆందోళనకు గురైన ఆ మహిళ ఈ విషయాన్ని అధికారులకు చెప్పింది. దీంతో విషయం కాస్త వైరల్ అయ్యింది.
మరో వైపు ప్రభుత్వం నిర్లక్ష్యంగా పనిచేస్తోంది.. అందుకే ఇలాంటి తప్పులు దొర్లుతున్నాయంటూ.. ప్రతిపక్షాలు విమర్శులు గుప్పిస్తున్నాయి.