
మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అగ్నిప్రమాదం జరిగింది ఆల్రెడీ పూర్తయిన ఆచార్య సినిమా సెట్ లో. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటించిన ఆచార్య చిత్రం గత ఏడాది విడుదలై డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించారు. ఈ చిత్రం కోసం గతంలో హైదరాబాద్ కోకాపేట లేక్ వద్ద భారీ సెట్ నిర్మించారు. సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆ సెట్ ని అలాగే ఉంచారు. కాగా నేడు ఈ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆచార్య చిత్రానికి అంత్యంత కీలకమైన టెంపుల్ సెట్ ధర్మస్థలిలో ఈ ప్రమాదం జరిగింది.
మొదట స్థానికులు మంటలు చెలరేగడం గమనించారు. దీనితో వట్టినాగులపల్లి ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారు. దీనితో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పుతున్నారు. భారీగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటలు ఎలా వ్యాపించాయి అనేది తెలియాల్సి ఉంది. ఆల్రెడీ పూర్తయిన సినిమా సెట్ కావడంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. చూస్తుంటే ఆచార్య విషయంలో ఏది కలసి రానట్లే అనిపిస్తోంది.
ఇదిలా ఉండగా చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. కీర్తి సురేష్, తమన్నా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనవరిలో సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య చిత్రం మెగా బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 200 కోట్ల పైగా గ్రాస్ రాబట్టింది.