
అతి పిన్న వయసులోనే నందమూరి తారకరత్న మరణించడంతో కుటుంబ సభ్యుల్లో తీరని వేదన మిగిల్చింది. అభిమానులు సైతం శోకంలో మునిగిపోయారు. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు. హీరోగా రాణించిన తారక రత్న రాజకీయాల్లో కూడా తన మార్క్ ప్రదర్శించాలనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఆయనకి గుండె సమస్య తీవ్రంగా మారడంతో మరణం సంభవించింది. తారకరత్న మృతిని కుటుంబ సభ్యులు ఇప్పటికీ జీర్ణించుకోలేకున్నారు.
భర్తని కోల్పోవడంతో తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో ఉంది. అలేఖ్య, తారక రత్న ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం. తన భర్త కోసం అలేఖ్య రెడ్డి ఇప్పటికీ రోధిస్తూనే ఉంది. తాజాగా అలేఖ్య రెడ్డి చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ అందరి హృదయాల్ని కలచి వేసే విధంగా ఉంది.
తారకరత్నతో చివరగా దిగిన ఫోటోని అలేఖ్య సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోకి ఆమె చేసిన కామెంట్స్ ఎంతో ఎమోషనల్ గా ఉంటూ.. అలేఖ్య కన్నీటిని తెలియజేస్తున్నాయి. చివరగా తిరుమలకి వెళ్ళినప్పుడు ఆలయం వద్ద తారక రత్న, అలేఖ్య రెడ్డి తమ ముగ్గురు పిల్లలతో ఫోటో దిగారు. ఆ ఫోటోనే అలేఖ్య అభిమానులతో పంచుకుంది.
' ఇదే మా చివరి ఫోటో అని తలుచుకుంటుంటే నా హృదయం బద్దలవుతోంది. ఇదంతా కల అయితే బాగుంటుంది. నీ వాయిస్ తో అమ్మ బంగారు అంటూ లేపవా ' అంటూ ఎంతో బాధతో అలేఖ్య రెడ్డి ఈ పోస్ట్ పెట్టింది. నెటిజన్లు కూడా అలేఖ్య రెడ్డికి మనో దైర్యం చేకూరాలని కోరుకుంటున్నారు.
ఏ సంబంధం లేని మాకే ఇంత బాధగా ఉంటే.. ఆయన భార్యగా మీకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలం అని కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా తారక రత్న రాజకీయాల్లో రాణించాలని భావించే లోపే తిరిగిరాని లోకాలకు వెళ్లారు. తారకరత్న కలని అలేఖ్య రెడ్డి ద్వారా సాకారం చేయాలని.. ఆమెని రాజకీయాల్లోకి తీసుకురావాలని బాలకృష్ణ ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.