
తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ కార్మికులు వేతనాల పెంపు కోసం గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు. 30శాతం(మూడేళ్లలో) వేతనాలు పెంచాలని సినీ వర్కర్స్ డిమాండ్ చేస్తున్నారు. అందుకు నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. ఫిల్మ్ ఛాంబర్‌తో జరిగిన చర్చలు విఫలం కావడంతో గత సోమవారం నుంచి సినీ కార్మికులు షూటింగ్‌ల బంద్‌కి పిలుపినిచ్చిన విషయం తెలిసిందే. 30శాతం వేతనాలు పెంచేందుకు హామీ ఇచ్చిన నిర్మాతల సినిమాల షూటింగ్‌లకు హాజరవుతామని తెలిపారు. దీంతో చాలా సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. కొందరు నిర్మాతలు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి షూటింగ్ చేస్తున్న నేపథ్యంలో దాన్ని కార్మికులు అడ్డుకున్నారు, ఇది పెద్ద గొడవలకు దారితీసింది.
ఈ వేతనాల పెంపు సమస్య చిరంజీవి వద్దకు వెళ్లింది. ఆయన ఫిల్మ్ ఛాంబర్‌తో చర్చలు జరపాలని, రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్మికుల నిరసనపై విచారం వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే తాను తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని తెలిపినట్టు నిర్మాత సి కళ్యాణ్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే శనివారం ఫిల్మ్ ఫెడరేషన్‌తో ఫిల్మ్ ఛాంబర్ నాయకులు చర్చలు జరిపారు. ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. 2000లోపు వేతనాలు కలిగిన కార్మికులకు మొదటి ఏడాది 15 శాతం వేతనాలు పెంచుతామని, రెండో ఏడాది ఐదు శాతం, మూడో ఏడాది మరో ఐదు శాతం వేతనాలు(మొత్తంగా 25శాతం) పెంచేందుకు రెడీగా ఉన్నట్టు ఛాంబర్ సెక్రెటరీ దామోదర ప్రసాద్ ప్రకటించారు. అలాగే వెయ్యి లోపు వేతనాలు ఉన్న కార్మికులకు మొదటి ఏడాది 20శాతం, మూడో ఏడాది ఐదు శాతం వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ఒప్పుకున్నట్టు వెల్లడించారు.
ఈ క్రమంలో తాజాగా ఫిల్మ్ ఫెడరేషన్ దీనిపై స్పందించింది. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, కార్యదర్శి అమ్మిరాజు, ఇతర నాయకులు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు(ఆదివారం) సమస్య పరిష్కారం కాకపోతే, ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు చేతులెత్తేస్తే సినిమా షూటింగ్‌లకు సంబంధించి సంపూర్ణ బంద్ ప్రకటిస్తామని తెలిపారు. అయితే ఈ రోజు సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు కొందరు తమ కుటుంబాన్ని(ఫిల్మ్ ఫెడరేషన్)ని విడగొట్టే ప్లాన్ చేస్తున్నారని, కేవలం 2వేల లోపు వేతనాలు ఉన్న యూనియన్లకే వేతనాలు పెంచుతామని అంటున్నారని, ఇది ఫ్యామిలీని విడగొట్టే ప్రయత్నమే అవుతుందన్నారు. రోజువారి వేతనాలు చెల్లించే యూనియన్లు 13 ఉన్నాయని, ఈ అన్నింటికి సమానంగా వేతనాలు పెంచాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో విడగొట్టే ప్రయత్నం చేయోద్దని వెల్లడించారు. నిర్మాతల నుంచి అలాంటి ప్రకటన రావడం తమని బాధించిందన్నారు.
తాము గొంతెమ్మకోరికలు కోరడం లేదని, సినిమా బడ్జెట్‌లో తమ వేతనాలు చాలా చిన్న విషయం అని తెలిపారు. సినిమాకి కోట్ల బడ్జెట్ పెడుతున్నారని, కానీ తమ కార్మికులకు చిన్నపాటి వేతనాలు చెల్లించేందుకు వెనకడుగువేస్తున్నారని తెలిపారు. బడ్జెట్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక, దాన్ని పరోక్షంగా తమపై రుద్దుతున్నారని తెలిపారు. ఛాంబర్ పెద్దలు తలుచుకుంటే సమస్య పరిష్కారం అవుతుందన్నారు అనిల్ వల్లభనేని.
ఈ సందర్భంగా చిరంజీవి ప్రస్తావన తెస్తూ, చిరంజీవికి తమ సమస్యని, ఇక్కడి విషయాలను ఎప్పటికప్పుడు తమ నాయకుల ద్వారా అందిస్తున్నామని, ఆయన కూడా తెలుసుకుంటున్నారని, ఫిల్మ్ ఛాంబర్లోనే సమస్యని పరిష్కరించుకోమని ఆయన చెప్పినట్టు అనిల్ వెల్లడించారు. అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోతే తాము ఇన్ వాల్వ్ అవుతామని చిరంజీవి చెప్పినట్టు తెలిపారు. ఈ విషయంలో చిరంజీవి వద్దకు వెళ్లడానికే కాదు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని, అలాగే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసేందుకు సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. వారు తమకు అండగా ఉంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఫిల్మ్ ఛాంబర్ త్వరగా సమస్యని పరిష్కరిస్తే తాము షూటింగ్‌లు వెళ్లడానికి సిద్ధంగానే ఉన్నామని, వ్యక్తిగతంగా ఎవరితోనూ తమకు విభేదాలు లేవని, కేవలం తాము చేసే కష్టానికి తగిన వేతనాలు మాత్రమే ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిపారు. తాము కోరుతున్న 30శాతం వేతనాలు ఒకే ఏడాది పెంచమని కాదని, మూడేళ్లపాటు పది శాతం చొప్పున కోరుతున్నట్టు వెల్లడించారు అనిల్ వల్లభనేని.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతతో వివాదానికి సంబంధించిన స్పందిస్తూ, వారు తమకి డైరెక్ట్ గా నోటీసులు పంపించారని, కానీ అలా పంపకూడదని, తమకు ఏది వచ్చినా ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే రావాలని, తమకు ఫిల్మ్ ఛాంబరే పెద్ద అని, వేతనాలు పెంపు అయినా, మరోటి అయినా ఫిల్మ్ ఛాంబర్ ద్వారా వస్తేనే తాము సమాధానం చెబుతామని, వ్యక్తిగతంగా పంపించడం సరికాదన్నారు. ఈ బ్యానర్ తమ కార్మికులకు రూ.90లక్షలు పెండింగ్‌లో ఉంచిందని, అవన్నీ చెల్లించాలని ఫిల్మ్ ఛాంబర్‌ని కోరినట్టు తెలిపారు అనిల్ వల్లభనేని. అలాగే తమపై నిర్మాత చేసిన వ్యాఖ్యలకుగానూ తమ కార్మికులు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నట్టు వెల్లడించారు. లేదంటే వేతనాల సమస్య పరిష్కారం అయినా ఆయన సినిమాల షూటింగ్‌లకు హాజరయ్యేందుకు కార్మికులు సిద్ధంగా లేరని తెలిపారు.
ఇలా సినీ కార్మికుల వేతనాల కోసం చేస్తున్న పోరాటం రోజు రోజుకి మరింత హీటెక్కుతుంది. ఆదివారం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫీస్ వద్ద కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు. తమ సమస్య పరిష్కారం కాకపోతే ఏం చేయాలనేది కార్యచరణ ప్రకటిస్తామని అనిల్ చెప్పారు. తమ ఫెడరేషన్‌లో హైదరాబాద్ ప్రాంతంలో సుమారు 24వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు.