
టాలీవుడ్ లో సమ్మె సైరన్
తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న కార్మికుల వేతనాల పెంపు సమస్య తీవ్రతరమవుతోంది. ఇప్పటికే ఆరు రోజులు పూర్తి చేసుకున్న ఈ సమ్మె కారణంగా టాలీవుడ్‌లోని అనేక చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో, సినీ కార్మికుల సంఘం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 30 శాతం వేతన పెంపు డిమాండ్ చేస్తుండగా, నిర్మాతలు మాత్రం ప్రస్తుతం పరిస్థితుల్లో అది సాధ్యం కాదని చెబుతున్నారు. అయితే 15 శాతం పెంపుదల కోసం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
చిరంజీవిని కలిసినట్టు ప్రచారం
అయితే, ఈ పరిస్థితుల మధ్య కొందరు ఫెడరేషన్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవిని కలిసినట్టు, ఆయన సోమవారం నుంచి తాను నటిస్తున్న సినిమాల్లో 30 శాతం వేతనాలు పెంచి చెల్లించేందుకు హామీ ఇచ్చినట్టు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ వార్తలపై తాజాగా చిరంజీవి స్వయంగా స్పందించారు.
తాను ఎవరినీ కలవలేదని, వేతనాల పెంపునకు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టంచేశారు. చిరంజీవి తన అధికారిక స్టేట్‌మెంట్‌లో ఇలా తెలిపారు:
మెగాస్టార్ ప్రకటనలో ఏముంది?
చిరంజీవి ప్రకటనలో ఈ విధంగా అన్నారు. "నా దృష్టికి వచ్చిన విషయం ఏమిటంటే — ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్లి, నేను వారిని కలసి, 30% వేతన పెంపు వంటి వారి డిమాండ్లను అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ సందర్భంలో నిజం ఏంటో స్పష్టంగా చెప్పదలచుకున్నాను. నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు."
ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన సమస్య అని, వ్యక్తిగతంగా ఏ ఒక్కరు అయినా (తాను సహా) ఈ విషయంపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని చిరంజీవి వివరించారు.
"తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్‌నే అగ్ర సంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి న్యాయసమ్మతమైన పరిష్కారానికి రావడం ఫిల్మ్ ఛాంబర్ సమిష్టి బాధ్యత. అంతవరకు, అన్ని పక్షాల్లో అబద్ధపు వ్యాఖ్యలతో గందరగోళం సృష్టించే ఉద్దేశ్యంతో చేసిన ఇలాంటి నిరాధారమైన, ప్రేరేపిత ప్రకటనలను నేను ఖండిస్తున్నాను. దయచేసి గమనించండి."అంటూ తన ప్రకటనను ముగించారు.
ఈ ప్రకటనతో ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్లు ,నిర్మాతల స్పందనపై స్పష్టత ఏర్పడినట్లు కనిపిస్తోంది. మరోవైపు, ఫిల్మ్ ఛాంబర్ వివిధ వర్గాలతో చర్చలు జరిపి త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపే అవకాశాలు ఉన్నాయి.తెలుగు సినిమా పరిశ్రమ తిరిగి సాధారణ స్థితికి చేరాలంటే అన్ని వర్గాలు పరస్పర సహకారంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నది పరిశ్రమ వర్గాల అభిప్రాయం.