బాహుబలికి ఆరు షోలకు అనుమతివ్వడంపై ఫిల్మ్ ఆడియెన్స్ సంఘం తీవ్ర అభ్యంతరం

First Published Apr 25, 2017, 11:41 AM IST
Highlights
  • ఏప్రిల్ 28న బాహుబలి 2 రిలీజ్
  • దేశమంతా బాహుబలి ఫీవర్
  • టికెట్ల కోసం అభిమానులు ఆపసోపాలు
  • షోలు ఎక్కువ వేయొద్దంటూున్న సినీ ప్రేక్షక సంఘాలు

ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న బాహుబలి 2 సినిమాకు విడుదల దగ్గరపడుతుండటంతో... అంతా బాహుబలి ఫీవర్ తో సందడిగా మారింది. ఇప్పటికే ఈ సినిమాని 6 షోలలో ప్రదర్శించుకునేందుకు ఏపీ ప్రభుత్వం థియేటర్లకు అనుమతి ఇవ్వడంపట్ల ఆ చిత్ర యూనిట్, అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

 

బాహుబలి అభిమానులు సంతోషం వెలిబుచ్చుతున్నా... తెలుగు సినిమా ఆడియెన్స్ అసోసియేషన్ మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆడియెన్స్ అసోసియేషన్ నుంంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఏపీ ప్రభుత్వం 'బాహుబలి -2'ని ఆరుసార్లు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇవ్వడం నియమనిబంధనలకి విరుద్ధం అవుతుందని సంఘం తెలిపింది. దీనిపై ఏపీ హోంశాఖ ప్రధాన కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేసిన తెలుగు సినిమా ఆడియెన్స్ అసోసియేషన్, సినిమా 6షోలను ప్రదర్శిస్తే ఆందోళనలు చేస్తామంటోంది.

 

నియమనిబంధనల ప్రకారం సినిమా థియేటర్లలో అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 8 గంటల మధ్య సినిమాలు ప్రదర్శించకూడదని, అలా కాకుండా ఆ మధ్య వ్యవధిలో సినిమాలని ప్రదర్శిస్తే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుందని అసోసియేషన్ తమ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. బాహుబలి-2 చిత్ర నిర్మాతలకి ఇచ్చిన అనుమతి కారణంగా అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 8 గంటల మధ్య థియేటర్లు షోలని ప్రదర్శిస్తాయని, అదే కానీ జరిగితే అది రూల్స్‌ని ఉల్లంఘించినట్టే అని అసోసియేషన్ అభ్యంతరం తెలిపింది.

 

బాహుబలి -2 అదనపు షోల ప్రదర్శనకి ఇచ్చిన అనుమతిని మరోసారి పరిశీలించి అనుమతిని వెంటనే ఉపసంహరించుకోవాలని అసోసియేషన్ తమ ఫిర్యాదులో డిమాండ్ చేసింది. అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఏపీ హోంశాఖ ప్రధాన కార్యదర్శి సైతం ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

click me!