
దక్షిణాదిలో సినిమా హిరోలను ఆరాధించే ఫ్యాన్స్ చాలా ఎక్కువ. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్, ఇలా అన్ని పరిశ్రమల్లోనూ.. హీరోలకు అంతటి క్రేజ్ పెరగటానికి కారణం వాళ్లకున్న అభిమానగణమే. అభిమానులకు మన హీరోలపై వుండే ఆరాధన, ప్రేమ మాటల్లో చెప్పలేనిది.
మామూలుగా హీరోల ఫాలోవర్స్ అప్పుడప్పుడూ అన్నదానం, వస్త్రదానం, రక్తదానం, నేత్రదానం లాంటి సేవలు చేస్తూ వుంటారు. ఇలాంటి అభిమానం భరించొచ్చు. కానీ కొన్నిసార్లు వాళ్లు చూపే అభిమానం ఆ నటీనటులకే భరించ లేనంతగా ఉంటుంది. అభిమానులు చేసే పనులు ఒక్కోసారి చూసేవాళ్ళకి వింతగా, విచిత్రంగా కనిపిస్తాయి. ఒక్కోసారి ఏకంగా గుళ్లు గోపురాలు కూడా కట్టేసి ఆయా హీరో హిరోయిన్లకు అభిషేకాలు, పూజలు చేస్తుంటారు.
తమిళనాట అందమైన కథానాయికలను అభిమానించడమే కాదు, గుడి గోపురాలు కట్టి అందులో విగ్రహాలను పెట్టి మరీ పూజలు, కుంకుమార్చనలు చేయిస్తూ ఆరాధిస్తారు. గతం లో ఖుష్బూ, నమిత, హన్సిక లకు, తాజాగా కీర్తీ సురేష్ కు కూడా గుడికట్టి తమ విపరీత అభిమానాన్ని చాటుకున్నారు తమిళ తంబీలు.
అయితే ఇప్పుడు ఈ పద్ధతి కథానాయకులకు, అందునా కర్ణాటక రాష్ట్రంలోకి పాకింది. కన్నడ రాష్ట్రం లో ఒక తెలుగు హీరోకి గుడి కట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూ నటించిన "జై లవకుశ" సినిమా.. కర్ణాటకలో విడుదలై భారీ వసూళ్ళను సాధించింది. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే గుల్బర్గా, బళ్లారి, ప్రాంతాల్లో "జై లవకుశ" విడుదలై భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది.
జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన కన్నడిగులు బళ్లారిలో జూనియర్ తారక రాముడుకి గుడి కట్టేందుకు సిద్ధమైపోయారు. ఇటీవలే తెలుగు హీరోల్లో భారీ ఫాలోయింగ్ వున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గుడి కట్టే ప్రయత్నాలు జరుగుతుండగా, తాజాగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో జూనియర్ ఎన్టీఆర్ దేవాలయం నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం ఆసక్తి కరంగా మారింది.