టాలీవుడ్ లో ఇగోల గోల... ఆ కుర్చీ కోసం కోల్డ్ వార్!

Published : Feb 12, 2022, 06:02 PM ISTUpdated : Feb 12, 2022, 06:09 PM IST
టాలీవుడ్ లో ఇగోల గోల... ఆ కుర్చీ కోసం కోల్డ్ వార్!

సారాంశం

చిరంజీవి (Chiranjeevi)నేతృత్వంలో ఏపీ సీఎం జగన్ తో చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కొరకు జరిగిన మీటింగ్ కొందరు పెద్దల ఇగోను దెబ్బతీసింది. అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించడాన్ని తప్పుపడుతూ పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో జీవో నెంబర్ 35 ప్రవేశపెట్టింది. దీని ప్రకారం టికెట్స్ ధరలు  తగ్గింపు, బెనిఫిట్ షోలు రద్దు, ఆన్లైన్ ద్వారా టికెట్స్ అమ్మకాలు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఆన్లైన్ విధానాన్ని స్వాగతించిన పరిశ్రమ ప్రముఖులు టికెట్స్ ధరల తగ్గింపు, బెనిఫిట్ షోల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇదే విషయమై ఏపీ ప్రభుత్వం, మంత్రులపై విరుచుకుపడ్డారు. గత మూడు నెలలుగా పలుమార్లు ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమ ప్రతినిధులకు మధ్య చర్చలు జరిగాయి. 

టికెట్స్ ధరల తగ్గింపు మొదటి నుండి విభేదిస్తున్న చిరంజీవి సీఎం జగన్ (CM YS Jagan)ని పలుమార్లు కలిశారు. కొద్దిరోజుల క్రితం ఆయన ఒక్కరే సీఎం జగన్ తో లంచ్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో పరిశ్రమ ప్రతిపాదనలు, సమస్యల గురించి చర్చకు వచ్చినట్లు చిరంజీవి వెల్లడించారు. సీఎం జగన్ చిరంజీవికి ఇస్తున్న ప్రాధాన్యత రీత్యా అనుకోకుండానే పరిశ్రమకు ఆయన ప్రతినిధిగా మారారు.  ఫిబ్రవరి 10న సీఎం జగన్ తో జరిగిన కీలక సమావేశానికి చిరంజీవి పలువురిని ఆహ్వానించారు. నాగార్జున, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. 

ప్రచారం జరిగినట్లు ప్రభాస్, మహేష్ (Mahesh babu)సీఎం జగన్ తో భేటీకి హాజరయ్యారు. నాగార్జున, ఎన్టీఆర్ మాత్రం హాజరు కాలేదు. దానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఇక భేటీ తర్వాత చిరంజీవితో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న రాజమౌళి, ప్రభాస్, మహేష్ సీఎం జగన్ తో పాటు చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజమౌళి అయితే ఒక అడుగు ముందుకేసి చిరంజీవి పరిశ్రమ పెద్ద అంటూ డిక్లేర్ చేశారు. 

ఇదంతా గమనిస్తున్న మంచు వర్గానికి సహజంగానే అసహనం కలిగింది. నిజానికి సీఎం జగన్ కి  చిరంజీవి కంటే మంచు మోహన్ బాబు(Mohan babu), మనోజ్ సన్నిహితులు, చుట్టాలు. ఆ పార్టీ జెండా కప్పుకున్నవారు. సీఎం జగన్ మాత్రం చిరంజీవికి ఈ విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం దగ్గర మాకు కూడా వెయిట్ ఉందని నిరూపించుకోవడానికి మంచు ఫ్యామిలీ.. సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని తమ ఇంటికి ఆహ్వానించారు. చిత్ర పరిశ్రమ సమస్యలపై మంత్రి పేర్ని నానితో కూలంకషంగా చర్చించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

మంచు ఫ్యామిలీతో పేర్ని నాని భేటీని జగన్ వ్యతిరేక మీడియా హైలెట్ చేసింది. చిరంజీవి, మహేష్, ప్రభాస్ లను తాడేపల్లికి పిలిచిన జగన్.. మంచు వారింటికి మాత్రం మంత్రిని పంపడం ఏమిటీ? ఇది చిరంజీవికి అవమానం అంటూ కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇదిలా ఉంటే పరిశ్రమ పెద్ద అనే కుర్చీ చుట్టూ ఇగోల యుద్ధం నడుస్తుంది. 

'మా' అధ్యక్ష ఎన్నికల కేంద్రంగా బయటపడిన ఈ ఆధిపత్య పోరు చాపకింద నీరులా పరిశ్రమలో పాకుతుంది. అధ్యక్ష ఎన్నికలు మంచు వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నట్లు జరిగాయి. ప్రకాష్ రాజ్ ని ఓడించి అధ్యక్షుడైన మంచు విష్ణు.. మెగా హీరోలపై  చేయి సాధించారు. అయితే కీలక పదవిలో ఉండి కూడా సీఎం జగన్ తో చర్చల విషయంలో మంచు ఫ్యామిలీ కి ప్రాతినిధ్యం లేకుండా పోవడం అవమానంగా భావిస్తున్నారు. 

ఇక మంచు విష్ణు గెలుపు వెనుక సీఎం జగన్ ఉన్నారని, అన్నీ తానై నడిపించాడని అప్పుడు పుకార్లు చక్కర్లు కొట్టాయి. జగన్ అనుచరులు ఏకంగా మా ఎన్నికల కేంద్రంలో కనిపించారన్న ఆరోపణలు కూడా చేశారు. తీరా చూస్తే జగన్.. చిరంజీవిని చేరదీస్తూ మోహన్ బాబును దూరం పెట్టారు. మా మాజీ అధ్యక్షుడు నరేష్ కి కూడా ఈ పరిణామం మింగుడు పడడం లేదు. మంచు విష్ణు విజయం కోసం వెనకుండి పని చేసిన నరేష్ ఇక ఉండబట్టలేక, అసహనాన్ని ఆపుకోలేక పరోక్షంగా స్పందించారు. 

సీఎం తో మీటింగ్ అభినందనీయం అంటూనే.. ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు కూడా పాల్గొని ఇంకా కూలంకషంగా పరిశ్రమ సమస్యలు చర్చించి ఉంటే బాగుండేదని ట్వీట్ చేశారు. మా అధ్యక్ష ఎన్నికల సమయంలో మొదలైన ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. పరిశ్రమకు పెద్ద ఎవరు? ఏదైనా సమస్య గురించి మాట్లాడాలంటే ప్రతినిధిగా ఎవరుండాలి? అనేది ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న తోపులాట. సీఎం జగన్ తో చిరంజీవి భేటీ వేదికగా మరోసారి ఇగోల గోల మొదలైందనడంలో ఎటువంటి సందేశం లేదు. 
 

PREV
click me!

Recommended Stories

Demon Pavan: రీతూ కంటే వాళ్లిద్దరూ హౌస్ లో ఉండడమే పవన్ కి ఇష్టమా.. తనూజపై నమ్మకం లేదంటూ..
మహేష్ బాబు సంస్కారానికి ఫిదా అయిన హీరో ఎవరో తెలుసా? సూపర్ స్టార్ అంతలా ఏం చేశారు?