సినీ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం!

By Sumanth Kanukula  |  First Published Oct 7, 2023, 9:23 AM IST

డ్రగ్స్ కేసుకు సంబంధించి టాలీవుడ్ హీరో నవదీప్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా కనిపిస్తుంది. తాజాగా నవదీప్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేశారు.


హైదరాబాద్: డ్రగ్స్ కేసుకు సంబంధించి టాలీవుడ్ హీరో నవదీప్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా కనిపిస్తుంది. తాజాగా నవదీప్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని ఈడీ ఆ నోటీసుల్లో పేర్కొంది.  వివరాలు.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఇటీవల హైదరాబాద్ నార్కొటిక్ బ్యూరో అధికారులు నవదీప్‌కు నోటీసులు జారీ.. విచారించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇదే కేసుకు సంబంధించి ఈడీ అధికారులు నవదీప్‌కు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. నవదీప్ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన అనుమానాల నేపథ్యంలోనే ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. 

ఈ కేసు విషయానికి వస్తే.. ఇటీవల డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు సినీ దర్శకుడు, మాజీ ఎంపీ కొడుకు సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో వాంటెడ్ గా ఉన్న నటుడు నవదీప్ పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ క్రమంలోనే నవదీప్‌ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇప్పటికే కస్టడీలో ఉన్న స్నేహితుడు రాంచంద్ నుంచి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని హైదరాబాద్ పోలీసుల తెలిపారు. 

Latest Videos

మరోవైపు నవదీప్ ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని ఖండించారు. అయితే ఇరువైపుల న్యాయవాదనలు విన్న న్యాయస్థానం.. నవదీప్‌కు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసు ఇచ్చి.. విచారణ చేపట్టాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవదీప్ పోలీసుల ముందు హాజరై వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.  

ఈ క్రమంలోనే నవదీప్ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం నవదీప్ మాట్లాడుతూ.. నార్కోటిక్ బ్యూరో అధికారులు అద్భుతంగా దర్యాప్తు చేస్తున్నారని ప్రశంసించారు. గతానికి సంబంధించిన వివరాలను కూడా అడిగారని చెప్పారు. పాన్ ఇండియా లెవల్లో టీఎస్ నార్కోటిక్ బ్యూరో సక్సెస్ రేటు చాలా ఎక్కువని కొనియాడారు. గతంలో తనపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చినప్పుడు సిట్, ఎక్సైజ్ విచారణకు సహకరించానని నవదీప్ గుర్తుచేశారు. 

ఇదిలాఉంటే, గతంలో కూడా నవదీప్‌ను ఈడీ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2017లో డ్రగ్స్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో నవదీప్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖలకు నోటీసులు జారీ చేసిన ఈడీ.. వారిని విచారించిన సంగతి తెలిసిందే. వారి బ్యాంక్ స్టేట్‌‌మెంట్స్, ఇతర ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆ సమయంలో ఆరా తీసింది. 

click me!