
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత మహేష్ భట్ కు చంపేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. మహేష్ కూతురు అలియాభట్ సహా కుటుంబాన్ని చంపేస్తామని గుర్తు తెలియని అగంతకులు బెదిరించారు. ఈ మేరకు ప్రముఖ దర్శకుడు, అలియా తండ్రి మహేశ్ భట్ ముంబైలోని జుహు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండేళ్ల క్రితం మహేశ్ భట్ కుటుంబాన్ని మట్టుబెడుతామని బెదిరించిన పలువురి గతంలో అరెస్ట్ చేశారు.
అయితే తాజాగా మరోసారి అలియాభట్ కుటుంబాన్ని అగంతకులు ఫోన్‌లో బెదిరించారు. రూ.50 లక్షలు లక్నోలోని బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలని హెచ్చరించారు. లేకపోతే అలియాను, ఆమె తల్లి సోని రజ్దాన్‌ను చంపివేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారాన్ని తొలుత నకిలీ ఫోన్ కాల్‌గా భావించారు. కానీ ఆ తర్వాత వాట్సప్ మెసేజ్ కూడా రావడంతో సీరియస్‌గా తీసుకొన్నారు. ‘మేం చెప్పిన డబ్బును బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలి. ఒకవేళ చేయకపోతే కొన్ని రౌండ్ల బుల్లెట్లు నీ కూతురు అలియా, భార్య సోని దేహంలోకి దూసుకెళ్తాయి' అని బెదిరించారు.
ఆందోళనకు గురైన భట్ ఫ్యామిలీ జుహు పోలీసు స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. దాంతో ఐపీసీ సెక్షన్ 387 ప్రకారం కేసు నమోదు చేశారు. ముంబై పోలీసుల భట్ ఫ్యామిలీ నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. భట్ నివాసం వద్ద భారీ భద్రతను కల్పించారు. తదుపరి విచారణ కోసం ఈ కేసును యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్‌కు బదిలీ చేశారు.
రెండేండ్ల క్రితం ఈ విధంగానే బెదిరించిన 13 మంది దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ సంబంధించిన వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 2014లో మహేశ్‌భట్ కుటుంబాన్ని మట్టుబెట్టేందుకు చేసిన కుట్రను భగ్నం చేశారు. మళ్లీ రెండేళ్ల తర్వాత ఫోన్ బెదిరింపులు రావడం బాలీవుడ్ ప్రముఖులను ఆందోళనకు గురిచేస్తున్నది.