
ప్రేక్షకులు అంచనాలకు మించిన అనుభూతి ఇవ్వడం రాజమౌళి స్టైల్. అలాగే తన ప్రతి కొత్త చిత్రం గత చిత్రాలను మించి ఉంటుంది. కెరీర్ బిగినింగ్ నుండి రాజమౌళి సినిమా సినిమాకు గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చారు. బాహుబలి సిరీస్తో దేశాన్ని మెప్పించిన ఈ దర్శక ధీరుడు, ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఇండియన్ సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లారు. ఆస్కార్ అసాధ్యం కాదని నిరూపించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి పేరు ప్రపంచ సినిమా వేదికలపై మారుమ్రోగింది.
చెప్పాలంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ రాజమౌళి బాధ్యత మరింత పెంచింది. అంతకు మించిన చిత్రాన్ని రూపొందించాల్సి ఆవశ్యకత ఏర్పడింది. రాజమౌళి తెరకెక్కించనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రాజెక్ట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఊహించని స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. బడ్జెట్ వందల కోట్లను దాటి వేల కోట్లకు చేరిందట. రాజమౌళి ఈ చిత్రాన్ని మూడు భాగాలు రూపొందిస్తున్నారట.
ఒక్కో భాగానికి బడ్జెట్ గా రూ. 700 కోట్లు కేటాయించారట. మొత్తంగా రాజమౌళి-మహేష్ చిత్ర బడ్జెట్ రూ. 2100 కోట్లు అట. మొదటి భాగం సక్సెస్ ఆధారంగా బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశం కలదంటున్నారు. మహేష్ బాబు ఈ చిత్రానికి ఏకంగా 10 ఏళ్లు కేటాయించనున్నారట. ఈ పదేళ్లలో ఆయన మరో ప్రాజెక్ట్ చేయరనే వాదన వినిపిస్తోంది. ఆ విధంగా మహేష్ ని రాజమౌళి లాక్ చేశారట.
జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఈ ప్రాజెక్ట్ ఉండనుంది. చిత్ర ప్రకటన రోజే కథపై ఓ హింట్ ఇవ్వడం రాజమౌళి స్టైల్. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల విషయంలో ఆయన అదే ఫాలో అయ్యారు. మహేష్ మూవీ కథ, జానర్స్ పై ఒక అవగాహన కల్పించారు. మహేష్ పాత్రకు రామ దూత హనుమాన్ స్ఫూర్తి అని చెబుతున్నారు.
రామాయణంలో హనుమంతుడు అనేక సాహసాలు చేశారు. ఆ అడ్వెంచర్స్ మహేష్ పాత్ర ద్వారా మోడరన్ యాంగిల్ లో రాజమౌళి చూపించవచ్చు. మరి రాముడు లేకుండా హనుమంతుడిని ఊహించలేం. ఈ క్రమంలో మహేష్ అత్యంత ఇష్టపడే వ్యక్తిగా ఈ ప్రాజెక్ట్ లో ఓ కీలక రోల్ ఉండే అవకాశం కలదు. ఆయన కోసం మహేష్ చేసే సాహసాలు ప్రధానంగా సినిమా సాగవచ్చు. ఇలా అనేక అంశాలు ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తిని పెంచేస్తున్నాయి.
ఇక ఈ ప్రాజెక్ట్ లో హాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ భాగం కానున్నారనే ప్రచారం జరుగుతుంది. ప్రకటనతోనే అంచనాలు పెంచి... ఆ హైప్ కంటిన్యూ చేయడంలో రాజమౌళి దిట్ట. మహేష్ ప్రాజెక్ట్ విషయంలో ఆయన విశ్వాసం చూస్తుంటే మరిన్ని సంచలనాలు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.