
సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబినేషన్‌లో వచ్చిన `సర్కారు వారి పాట` విజయవంతంగా రన్ అవుతుంది. ఈ చిత్రం అటు మహేష్, ఇటు దర్శకుడు పరశురామ్‌లకు బోల్డ్ అటెంప్ట్. సినిమా కమర్షియల్ యాంగిల్‌లో రూపొందించినా, ఇందులో డైలాగ్‌లు, కొన్ని సీన్లు మాత్రం వివాదంగా మారాయి. `నేను విన్నాను, నేను ఉన్నాను` అనే డైలాగ్ రాజకీయ రంగు పులుముకుంటే, `వంద వయాగ్రాలు..`, `సగం ప్యాంట్ వేసుకున్నావ్`, అనే డైలాగ్, అలాగే హీరోయిన్‌పై కాలు వేసుకుని పడుకునే సన్నివేశం, దానికి దర్శకుడు పరశురామ్ ఇచ్చిన వివరణ వివాదంగా మారాయి.
తాజాగా మరో వివాదం చక్కర్లు కొడుతుంది. ఇందులో విలన్ `నరసింహస్వామి` దేవుడిని ఉద్దేశిస్తూ చెప్పిన డైలాగ్ భక్తుల మనోభావాలను దెబ్బతిసింది. హీరో మహేష్‌తో విలన్ పాత్ర ధారి అయిన సముద్రఖని చెప్పే.. `సింహాచలంలో నరసింహస్వామిని ఏడాదంతా చందనంతో కప్పి ఉంచుతారు. ఎందుకో తెలుసా.. ఆయన నిజ స్వరూపం భయంకరంగా ఉంటుంది. చూస్తే తట్టుకోలేరు` అని చెబుతారు. విలన్ ని నరసింహస్వామితో పోల్చడంపై ఇప్పుడు వివాదంగా మారింది.
నరసింహ స్వామి భక్తులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై దర్శకుడు పరశురామ్ స్పందించి క్షమాపణలు తెలిపారు. ఇటీవల పరశురామ్ సింహాచలంలోని నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దీనిపై దర్శకుడిని ప్రశ్నించగా, ఆయన స్పందించి సారీ చెప్పారు. తాను నరసింహస్వామికి పెద్ద భక్తుడినని తెలిపారు. ‘సర్కారు వారి పాట’ సినిమాను ప్రారంభించే ముందు కూడా స్వామి వారిని దర్శించుకున్నానని, సినిమాలో డైలాగ్‌ను కావాలని పెట్టలేదని, ఒకవేళ ఆ విషయంలో భక్తుల మనో భావాలు దెబ్బ తిని ఉంటే క్షమించాలని తెలిపారు.
మరి దీంతో ఈ వివాదం సర్దుమనుగుతుందా? అనేది చూడాలి. ఇక మహేష్ బాబు హీరోగా, కీర్తిసురేష్ కథానాయికగా నటించిన `సర్కారు వారి పాట` చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. మే 12న ఈ సినిమా విడుదలైంది. మిశ్రమ స్పందన తెచ్చుకున్నా కలెక్షన్లు బాగానే ఉన్నాయి. దాదాపు వంద కోట్ల షేర్ రాబట్టడం విశేం. నెక్ట్స్ పరశురామ్.. నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నారు. అలాగే మహేష్.. త్రివిక్రమ్ సినిమాని జూన్‌లో స్టార్ట్ చేయబోతున్నారు.