ఇన్నాళ్లకు ‘మిస్సమ్మ’ డైరెక్టర్ కొత్త సినిమా.. ఆసక్తికరంగా ‘సర్కిల్’ ఫస్ట్ లుక్ పోస్టర్..

By Asianet News  |  First Published May 9, 2023, 5:44 PM IST

తొమ్మిదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు  ‘మిస్సమ్మ’ దర్శకుడు నీలకంఠ. తాజాగా ఆయన దర్శకత్వంలో వస్తున్న కొత్తసినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఆ మూవీ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. 
 


నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు నీలకంఠ (Neelakanta) చాలా కాలం తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కేరీర్ లో చేసినవి కొన్ని సినిమాలే అయినా గుర్తుండిపోయేలా చేశారు. నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన ‘షో’ అనే ఫీచర్ ఫిల్మ్ తో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు దక్కించుకున్నారు. అలాగే ‘విరోధి’ మరియు షో చిత్రాలు ఇండియన్ పనోరమ లో కూడ సెలెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత కమర్షియల్ సక్సెస్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న మిస్సమ్మ, సదా మీ సేవలో వంటి  చిత్రాలతో ఆకట్టుకున్నారు. ‘మిస్సమ్మ’ చిత్రానికి నాలుగు నంది అవార్డులు కూడా అందాయి. ఈయన డైరెక్షన్ లో చివరిగా ‘మాయ’, ‘జామ్  జామ్’ చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. 

మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ నీలకంఠ నుంచి మరో ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతోంది. తొమ్మిదేళ్ల విరామం తర్వాత మరో కొత్తమూవీతో  ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన  మోషన్ పోస్టర్ విడుదలై ఆకట్టుకుంటోంది. 'సర్కిల్' అనే చిత్రంతో వస్తున్నాడు నీలకంఠ. ఈ చిత్రానికి ఇచ్చిన ‘ఎవరు, ఎప్పుడు, ఎందుకు శతృవులవుతారో’ అనే ట్యాగ్ లైన్ ఆకట్టుకుంటోంది. 

Latest Videos

తాజాగా ఈ చిత్ర టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఒక మోడల్ ఫోటో కెమెరా లెన్స్ తిరుగుతుండగా.. దానితో పాటు ఎవరు, ఎప్పుడు, ఎందుకు శతృవులవుతారో అనే ట్యాగ్ తో ఎండ్ అవుతుందీ మోషన్ పోస్టర్. చూస్తోంటే ఇది మరోసారి నీలకంఠ తరహాలోనే సాగే వైవిధ్యమైన సినిమాగా కనిపిస్తోంది. దీంతో పాటు చిత్ర తారాగణం సైతం ఆసక్తికరంగానే ఉంది. 

మూవీకి సినిమాటోగ్రపీగా రంగనాథ్ గోగినేని, ఎడిటర్ గా మధు రెడ్డి వర్క్ చేస్తున్నారు. ఎన్.ఎస్ ప్రశు సంగీతం అందిస్తున్నారు. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాతలు ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రంలో సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,రిచా పనై, నైనా , పార్థవ సత్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

click me!