
ప్రభాస్ హీరోగా, కాజల్, తాప్సీ హరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం మిష్టర్ పర్ ఫెక్ట్. దాదాపు ఆరేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయం సొంతం చేసుకుంది. అయితే.. అప్పుడు విడుదలైన ఈ సినిమా ఇప్పుడు వివాదాల్లోకి ఎక్కింది.
ఆ సినిమా కథ నాదంటూ శ్యామలారాణి అనే ఓ రచయిత కోర్టులో కేసు వేశారు. దీంతో దీనిపై మిష్టర్ ఫర్ ఫెక్ట్ చిత్ర దర్శకుడు దశరథ్ క్లారిటీ ఇచ్చారు. అది తన కథేనని.. ఎక్కడ నుంచి కాపీ కొట్టలేని దశరథ్ స్పష్టం చేశారు. రచయిత్రి శ్యామలారాణి ఇలాంటి కథ నేపథ్యంలోనే రాసిన నవల 2010 ఆగస్టులో విడుదలైందని.. కానీ తాము ఈ సినిమా కథను అంతకన్నా ముందు రెండు సంవత్సరాల క్రితమే అనుకున్నామన్నారు.
2009 ఫిబ్రవరి 19నే ‘నవ్వుతూ’ పేరుతో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కథను రైటర్స్ యూనియన్ లో రిజిస్టర్ చేశామని ఈ దర్శకుడు పేర్కొన్నాడు. అలాంటప్పుడు తమ సినిమా కథ కాపీ ఎలా అవుతుంది? అని ప్రశ్నించాడు. కథను రైటర్స్ యూనియన్ లో రిజిస్టర్ చేయించకముందే.. అంతకు కొన్ని నెలల క్రితమే తను, నిర్మాత దిల్ రాజు మలేషియా వెళ్లి ప్రభాస్ కు ఆ సినిమా కథను చెప్పామన్నాడు. అప్పట్లో ప్రభాస్ ‘బిల్లా’ సినిమా షూటింగ్ కోసం మలేసియాలో ఉండటంతో తాము అక్కడకు వెళ్లామని చెప్పారు.
శ్యామలారాణి ఈ విషయంలో ముందుగా తమను సంప్రదించారని, ఆమెకు తాము వివరణ ఇచ్చామని.. అయినప్పటికీ ఇలా కోర్టులో కేసు వేయడం సరికాదని దశరథ్ అన్నారు.తాము కాపీ కొట్టామని ప్రజలు అనుకోకూడదనే ఈ వివరణ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.