
రైతు ఉద్యమం, పెట్రో ధరల మంటలు సెలబ్రిటీలకు తగిలాయి. దీనిపై బిగ్ స్టార్స్ స్పందించడం లేదంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ రైతు మద్దతు యాత్ర, పెట్రోల్ ధరల పెరుగుదల విషయంలో వీరు స్పందించనందుకు వారి సినిమాలు ప్రదర్శించకుండా అడ్డుకుంటామని, షూటింగ్‌లు జరుగకుండా చూస్తామని కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే హెచ్చరించారు. దీంతో ఇది బాలీవుడ్‌లో, మహారాష్ట్రలో దుమారం రేపుతుంది.
దీనిపై తాజాగా స్పందించారు కేంద్ర మంత్రి రామ్‌దాస్ అరావలే. `హిందీ, మరాఠీ సినీ పరిశ్రమలు ముంబయి నగరానికి గౌరవ ప్రతీకలని, సినీ పరిశ్రమ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలిగిస్తుంది. వాటిని అడ్డుకోవడం సమంజసం కాద`న్నారు. `ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి బెదిరింపులకు స్థానం లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి బెదిరింపులను అమలు ఏసినట్టయితే రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి సినీ పరిశ్రమకు అండగా నిలబడతారు. అమితాబ్, అక్షయ్‌లకు రక్షణ కవచంగా మారుతుంది` అని తెలిపారు.
ఇదిలా ఉంటే కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా అమితాబ్, అక్షయ్ లు సోషల్ మీడియాలో `మేం కార్లయితే కొనగలం, కానీ పెట్రోల్‌కొనలేం` అని కామెంట్ చేశారని, అలాంటిది ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు చెప్పాలని నానా పటోలే డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి సెలబ్రిటీలు కూడా భయపడుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నటులు అండగా తాము ఉంటామని కేంద్రమంత్రి వెల్లడించారు.