
సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నటించిన తాజా చిత్రం రిపబ్లిక్(Republic) నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే యూఎస్ లాంటి ప్రాంతాల్లో ప్రీమియర్స్ మొదలయ్యాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో సెలెబ్రిటీల కోసం ఈ చిత్ర ప్రీమియర్ షో ప్రదర్శించారు. తేజు ప్రమాదానికి గురైన తర్వాత విడుదలవుతున్న చిత్రం కావడంతో సపోర్ట్ చేయడానికి సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు.
హీరో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అతడి చిత్రం రిలీజ్ కావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. దీనికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వాన్ని అటాక్ చేసిన విధానం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిస్థితుల్లో రిపబ్లిక్ మూవీ రిలీజ్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి ముందుగా రిపబ్లిక్ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. 'సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ అందరి ఆశీస్సులు రిపబ్లిక్ చిత్ర విజయం రూపంలో దక్కుతాయని ఆశిస్తున్నాను. చిత్ర యూనిట్ కి నా శుభాకాంక్షలు. కరోనా బారీన పడి కుదేలైన ఎగ్జిబిషన్ సెక్టార్ కి ఈ చిత్ర విజయం కోలుకోవడానికి కావలసినంత ధైర్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను' అని చిరు ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా రిపబ్లిక్ చిత్ర ప్రీమియర్ షోని మారుతి, హరీష్ శంకర్, మెహర్ రమేష్, నేచురల్ స్టార్ నాని లాంటి సెలెబ్రిటీలు వీక్షించారు. సినిమాపై తమ స్పందన తెలియజేశారు.
'రిపబ్లిక్ చిత్రం చూశాను. తేజు తన చుట్టూ ఉన్న వారందరిపై చూపించే ప్రేమాభిమానాలు మీ ప్రార్థనల రూపంలో తిరిగి అతడికి చేరుతున్నాయి. అతడు ఎంత బలంగా మన ముందుకు రాబోతున్నాడో తెలియజేసే చిత్రం రిపబ్లిక్. సాయి ధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్ అంటూ దేవకట్టా బలంగా అనౌన్స్ చేసిన చిత్రం ఇది. చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ ' అని నాని ట్వీట్ చేశాడు.
'రిపబ్లిక్ ఇప్పుడే చూశాను. నిస్సందేహంగా రిపబ్లిక్ చిత్రంలో సాయిధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అందించాడు. దేవకట్టా హానెస్ట్ స్టోరీతో మన ముందుకు వచ్చారు. జగపతి బాబు, రమ్య కృష్ణ, ఐశ్వర్య రాజేష్ తమ పాత్రల్లో జీవించారు. చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్' అని హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.
రిపబ్లిక్ చిత్రానికి హీరో శర్వానంద్, కమెడియన్ వెన్నెల కిషోర్, గోపీచంద్ మలినేని, మెహర్ రమేష్ తమ బెస్ట్ విషెష్ అందించారు.