
మెగా ఇంట సంబరాలు నెలకొన్నాయి. మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పాప పుట్టింది. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో పాప పుట్టింది. మెగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు సహా మెగాభిమానులు ఈ విషయంతో సంతోషంగా ఉన్నారు.
మనవరాలు పుట్టటంపై మెగాస్టార్ చిరంజీవి మీడియా ముఖంగా స్పందించారు. ‘‘మంగళవారం ఉదయం 1 గంట 49 నిమిషాలకు రామ్‌చరణ్, ఉపాసనలకు పాప పుట్టింది. ఇంటిల్లిపాది చాలా సంతోషంగా ఉన్నాం. ఈ పాప ఎంతో అపురూపం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్లు తల్లిదండ్రులై బిడ్డలను మా చేతిలో పెట్టాలని అనుకుంటున్నాం. ఇన్నేళ్లకు ఆ భగవంతుడి దయ వలన, అందరి ఆశీస్సులు వలన ఆ కోరిక నేరవేరింది. ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల నుంచి మా స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, మా సంతోషాన్ని తమ సంతోషంగా భావించే అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారందరికీ నా కుటుంబం తరపున ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను.
పెద్దలు పాప పుట్టిన ఘడియలు చాలా మంచివని అంటున్నారు. ఆ ప్రభావం ముందు నుంచి చూపిస్తుంది. ఈ మధ్య కాలంలో చరణ్ ఎదుగుదల, తను సాధించిన విజయాలను కానివ్వండి. అలాగే ఈ మధ్య వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్. ఇలా మా ఇంట్లో అన్నీ శుభకార్యాలే జరగటం చూస్తుంటే ఈ బిడ్డ ప్రభావం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. నా కుటుంబం ఆంజనేయ స్వామినే నమ్ముకున్నాం. ఆయనకు సంబంధించిన మంగళవారం రోజున ఆడ బిడ్డను ప్రసాదించటం అనేది అపురూపంగా భావిస్తున్నాం. అపోలోలో బెస్ట్ టీమ్ పర్యవేక్షణలో చాలా సుఖంగా ప్రసవం జరిగింది. అందరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు.
ఈ సంతోషాన్ని చిరంజీవి పరిశ్రమ ప్రముఖులతో జరుపుకోవాలని అనుకుంటున్నారట. అందుకు గాను తన నివాసంలో గ్రాండ్ పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నారట. పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, బంధు మిత్రులకు ఆహ్వానం లభించనుందట. ఈ పార్టీని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారట. రామ్ చరణ్ తండ్రి కావాలనేది పదేళ్ల నిరీక్షణ. అందుకే ఉపాసన బిడ్డకు జన్మనివ్వడం అత్యంత మధురానుభూతిని మిగిల్చింది. ఇక చిరంజీవి మనవరాలికి ఏం పేరు పెడతారనే చర్చ మొదలైంది.. మంగళవారం పుట్టిన నేపథ్యంలో హనుమంతుడు పేరు కలిసేలా నామధేయం చేసే ఆస్కారం కలదు.