అగ్ర నటులు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు.
'మా' ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద చిన్న చిన్న ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల అధికారులు, పోలీసులు పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ప్రచారం చేస్తున్నారు అంటూ విష్ణు ప్యానల్ సభ్యులు వాగ్వాదానికి దిగారు.
ఇదిలా ఉండగా టాలీవుడ్ అగ్ర నటులు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు. ఈసారి మా ఎన్నికలు చాలా ఉత్కంఠ భరితంగా సాగడంపై Chiranjeevi మాట్లాడుతూ.. ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవని అన్నారు. పరిస్థితులకు తగ్గట్లు మనం కూడా సమాయత్తం కావాలని సూచించారు. అయినా మీడియాకు మంచి మెటీరియల్ దొరికింది కదా అని చమత్కరించారు.
ఇక Balakrishna మాట్లాడుతూ.. విష్ణు, ప్రకాష్ రాజ్ ఇద్దరూ అన్నదమ్ముల లాంటి వారు. రెండు ప్యానల్స్ లో ఇండస్ట్రీకి మంచి చేసేవారు ఉన్నారు. కానీ ఒకరికే ఓటు వేయాలి. ఇద్దరూ కూడా మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించేవారు. ఏది ఏమైనా రేపటి నుంచి అంతా కలసి షూటింగ్స్ చేసుకోవాల్సిన వాళ్ళం. ఎవరు గెలిచినా అంతా కలసి ఒకరికొకరు సాయం చేసుకోవాలి అని బాలయ్య సూచించారు.
సాయి కుమార్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాధారణ ఎన్నికల స్థాయిలో మా ఎన్నికలు జరుగుతున్నాయి. వాస్తవానికి నేను కూడా పోటీ చేద్దామని అనుకున్నా. కానీ షూటింగ్స్ తో బిజీగా ఉండడం వల్ల కుదర్లేదు అని సాయి కుమార్ చెప్పుకొచ్చారు. తాను లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడనని.. ఎందుకంటే తాను నేషనలిస్ట్ అని సాయి కుమార్ పేర్కొన్నారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. 4 గంటల నుంచి లెక్కింపు ఉంటుంది. మా ఎన్నిక కోసం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.