
హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులపై హీరోయిన్ తమన్నా బౌన్సర్‌లు దాడికి పాల్పడ్డారు. అన్నపూర్ణ స్టూడియోలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం బబ్లీ బౌన్సర్. ఈ చిత్రానికి మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబరు 23న డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్‌లో భాగంగా.. అన్నపూర్ణ స్టూడియోలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్‌మీట్‌లో తమన్నా, మధుర్ భండార్కర్ మాట్లాడారు.
ప్రెస్ మీట్ అనంతరం మీడియా ప్రతినిధులతో తమన్నా బౌన్సర్లు దురుసుగా ప్రవర్తించారు. మీడియా ప్రతినిధులు తమన్నా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించినట్టుగా సమాచారం. ఆ సమంలో తమన్నా బౌన్సర్లు, మీడియా ప్రతినిధులు వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు కెమెరామెన్లకు స్వల్ప గాయాలయ్యాయి.
అయితే ఈ విషయం తెలుసుకున్న చిత్ర బృందం మీడియా ప్రతినిధులుకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. జరిగిన ఘటనపై చింతిస్తున్నట్టుగా పేర్కొంది.