బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ మరోసారి షూటింగ్ లో గాయపడ్డాడు. ఈసారి టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన సెట్ లో ప్రమాదానికి గురయ్యారు. తలకు గాయమైనట్టు తెలుస్తోంది.
మాస్ ఇమేజ్ కోసం పాకులాడుతున్న లవర్ బాయ్ రామ్ పోతినేని (Ram Pothineni)కి ‘ఇస్మార్ట్ శంకర్’తో ఆ క్రేజ్ దక్కిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. దీంతో సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం Double Ismart గా రూపుదిద్దుకుంటోంది. అనౌన్స్ మెంట్, పూజా కార్యక్రమం, షూటింగ్ ప్రారంభం అన్నీ వేగంగా జరిగాయి. ముందే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన పూరీ ఆ దిశగా షెడ్యూల్ ను ఫిక్స్ చేశారు. ఆలస్యం లేకుండా షూట్ కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ థాయిలాండ్ లో కొనసాగుతుందని తెలుస్తోంది. ఇక్కడ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) తో యాక్షన్ సీక్వెల్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో సంజయ్ దత్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. కత్తితో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో ఆయన తలకు గాయం అయిందని, రెండు కుట్లు కూడా పడ్డాయని యూనిట్ తెలిపింది. అయినా షూటింగ్ ఆపకుండా వెంటనే సెట్ కి తిరిగి వచ్చారని పేర్కొన్నారు. దీంతో ఆయన అభిమానులు త్వరతో గా కోలుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఏప్రిల్ లో ఓ కన్నడ చిత్ర షూటింగ్ సందర్భంలోనూ సంజయ్ గాయపడ్డారు. ధృవ సర్జా సినిమా షూటింగ్ లో భాగంగా బెంగళూరు లోకేషన్ లో బాంబు పేలుడు సీన్ చేస్తుండగా గాయపడ్డారు. అప్పుడు ఆయన మోచేయి, చేతులు, ముఖానికి గాయాలైన విషయం తెలిసిందే. అది మరిపోముందుకే మరో గాయమవడం ఫ్యాన్స్ ను బాధిస్తోంది. అయినా సినిమాల విషయంలో సంజయ్ దత్ చేస్తున్న రిస్క్ కు అభినందనలు అందుతున్నాయి.
ఇక సంజయ్ దత్ ‘డబుల్ ఇస్మార్ట్’లో విలన్ గా నటిస్తున్నారు. బిగ్ బుల్ పాత్రలో అలరించబోతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆయన పుట్టిన రోజు సందర్భంగా యూనిట్ విడుదల చేసింది. మాస్ అవతార్ లో ఫెరోషియస్ లుక్ కు మాసీవ్ రెస్పాన్స్ దక్కింది. ఇప్పటికే ఈ మూవీ ముంబైలో ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. చిత్రంలో హీరోయిన్ గా బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య, మరోవైపు మీనాక్షి చౌదరి పేరు గట్టిగా వినిపిస్తోంది. పూరీ, ఛార్మీ కౌర్ నిర్మాతలు గా పూరీ కానెక్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 2024 మార్చి 8న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.