
హిందూపురం ఎమ్మెల్యే... సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో తన సిబ్బందితోపాటు సాధారణ అభిమానులపైనా చేయి జేసుకొంటూ పలు మార్లు వార్తల్లో నిలిచారు. అభిమానులను బాలయ్య కొట్టడం అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశమైంది. అభిమానులపై దాడి చేస్తున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల బాలయ్య పలువురితో తన అభిప్రాయాలను పంచుకొన్నారు. తాను చేయి చేసుకోవడంపై ఆయన వివరణ ఇచ్చారు.
నాకు అభిమానులకు దగ్గరగా ఉండటమంటే చాలా ఇష్టం. ఫ్యాన్స్ అంటే నాకు ప్రాణం. అందుకే వారికి దగ్గరగా ఉంటాను. కానీ నేను ఇచ్చిన చొరవను కొన్నిసార్లు కొందరు దుర్వినియోగం చేస్తారు. ఎవరైనా నా వద్ద హద్దులు అతిక్రమిస్తే నాకు కోపం వస్తుంది అని చెప్పారు. నేను అభిమానుల మధ్యకు వెళ్లినప్పుడు వారు చేసే కొన్ని పనులు నన్ను చాలా విసిగిస్తాయి. వాళ్లు ఏం చేస్తారో అది ఇతరులకు గానీ, మీడియా కంటికి కనిపించవు. నావద్ద హద్దు మీరిన వారిని ఒక్కటి వేస్తే దానిని గోరంతలు కొండంతలు చేస్తారు. ఆ తర్వాత బాలయ్య అలా కొట్టాడు. ఇలా కొట్టాడు అని ఆ ఘటనను మీడియాలో హైలెట్ చేస్తారు. ఈ విషయంలో నేను ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకొంటున్నాను.
నేను అందరు హీరోల మాదిరిగా నా చుట్టూ రక్షణగా బౌన్సర్లను ఉపయోగించుకోను. దానికి కారణం కేవలం నేను నా అభిమానులకు దూరంగా ఉండటం అసలే నాకు ఇష్టం ఉండదు. కొన్నిసార్లు బౌన్సర్ల వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఏదో ఒక ఈవెంట్ సందర్భంగా నా అభిమానులపై కొందరు బౌన్సర్లు చేయిచేసుకొన్నారు. అప్పటి నుంచి బౌన్సర్లను ఉపయోగించుకోవద్దని అనుకొన్నాను. ఎందుకంటే నా ఫ్యాన్స్‌ను ఎవరైనా కొడితే నాకు చాలా బాధ కలుగుతుంది. అందుకే అలాంటి పద్ధతికి దూరంగా ఉంటున్నాను.
కానీ బౌన్సర్లను ఉపయోగించుకోకపోవడం వల్ల ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. నేను ఫ్యాన్స్‌తో మమేకం కావాలని అనుకొంటే వారు నాపైకి దూసుకొస్తున్నారు. కాళ్లు తొక్కతుంటారు. నెట్టివేస్తుంటారు. దూరంగా ఉండాలని హెచ్చరించినా వాళ్లు పట్టించుకోరు. అందుకే కోపంతో ఒక్కటి ఇచ్చుకోవడంతో.. అది నాపైనే రివర్స్ అయి సమస్యలు ఎదురవుతున్నాయి అని బాలయ్య ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.
నన్ను అనేక వివాదాలు చుట్టుముడుతున్నందున నా మిత్రులు, సన్నిహితుల సూచన మేరకు నేను ఇక నుంచి బౌన్సర్లను ఉపయోగించుకోవాలనుకొంటున్నాను. తప్పని పరిస్థితుల్లో నేను అభిమానులకు కొంత దూరం కావాల్సి వస్తున్నది అని ఇటీవల తన సన్నిహితులకు వెల్లడించినట్టు సమాచారం.
బాలకృష్ణ సన్నిహితులు చెప్పిన ప్రకారం చూస్తే.. ఇక నుంచి బాలయ్య ఎవరిని కొట్టడానికి వీలు ఉండదు అనేది స్పష్టమవుతున్నది. భవిష్యత్‌లో అభిమానుల గుంపు బాలయ్య చుట్టూ కనిపించదు. కొందరు హద్దు మీరిన ఫ్యాన్స్ వల్ల మిగితా అభిమానులకు బాలయ్యను దూరం నుంచే చూడాల్సి వస్తుందనేది ఖాయమనిపిస్తున్నది.